వరుడికి వధువు షాక్.. ఆపై యువకుడు సూసైడ్..

ఆంధ్రప్రదేశ్ లో నిత్యం ఏదో ఒకట ఘటన జరుగుతూనే ఉంది. లాక్ డౌన్ కరోనా కాలంలో కూడా నిత్య వ్యవహారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి ముహూర్తాలు పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో పెళ్లికూతురు మైనర్ అని తేలడంతో వివాహం ఆగిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే జిల్లాలోని ఎచ్చెర్ల మండలం కొయ్యాం పంచాయతీ కొత్తకూర్మినాయుడుపేట గ్రామానికి చెందిన వెంకటరెడ్డి  మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతడికి గార మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయితో పెద్దలు పెళ్లి సంబంధాన్ని కుదిర్చారు. మే 15వ తేదీన వివాహ ముహూర్తంగా పెట్టుకున్నారు. అయితే పెళ్లికి అన్ని ఏర్పాట్లుచేసుకున్న సమయంలో పెళ్లి కూతురు మైనర్ అంటూ కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అధికారులు దర్యాప్తు చేపట్టి ఆమె మైనరే అని తేల్చడంతో పెళ్లి ఆగిపోయింది. అప్పటి నుంచి మనస్తాపంగా ఉంటున్న వెంకటరెడ్డి తాజాగా తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

కాగా వెంకటరెడ్డికి తల్లి దమయంతి, ఇద్దరు తమ్ముళ్లు, అక్క, చెల్లి ఉన్నారు. తండ్రి అనారోగ్యంతో కొన్నేళ్ల కిందట మృతి చెందడంతో కుటుంబాన్ని అతడే పోషిస్తున్నాడు. ప్రస్తుతం కుటుంబమంతా శ్రీకాకుళంలోని బలగలో నివాసం ఉంటోంది. వెంకటరెడ్డికి పెళ్లి చేయాలన్న ఆలోచనతో సొంతూరు అయిన కొత్తకూర్మినాయుడుపేటలో ఈ మధ్యనే  కొత్త ఇల్లు కట్టించుకున్నారు. ఈ మధ్యనే కొత్తకూర్మినాయుడుపేటకు వెళ్లిన వెంకటరెడ్డి రాత్రికి అక్కడే ఉండి ఉదయం టెక్కలిలోని తన మెకానిక్‌ దుకాణానికి వెళ్తానని తల్లికి చెప్పాడు. దీంతో ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులంతా విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.