పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సొంతపార్టీ నేతలు వరుసగా షాక్ ఇస్తున్నారు. త్వరలోనే టీఎంసీకి చెందిన ఎమ్మెల్యే అరిందం భట్టాచార్య బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. నాడియా శాంతిపూర్ నియోజకవర్గానికి చెందిన భట్టాచార్య బుధవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియాను కలిశారు. దీంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక్కొక్కరుగా తమపార్టీ నేతలు బీజేపీలోకి చేరుతుండటంతో ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై టీఎంసీ పూర్తిగా దృష్టిని సారించింది.
మరోవైపు ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని కమలదళం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అంచనావేస్తూ, తృణమూల్ కాంగ్రెస్‌ను ధీటుగా ఢీ కొట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఇప్పటికే కాషాయ కండువా కప్పుకున్నారు. వీరేగాక ఇంకా 41 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి కైలాష్ విజయవర్గియా ఇటీవల వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది.