ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లో ఓటమి పాలైన టీమిండియాకు మరో షాక్ తగిలింది. సిడ్నీ వేదికగా మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో భారత జట్టు నిర్ధిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసిందని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తెలిపాడు. ఫీల్డ్ అంపైర్లు రాడ్ టక్కర్, గెరార్డ్ అబూద్ స్లో ఓవర్ రేట్ విషయాన్ని మ్యాచ్ రిఫరీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో భారత జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ రిఫరీ జరిమానా విధించాడు.
ఐసీసీ నిబంధనలో భాగంగా ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. ఆసీస్ టూర్‌లో విరాట్ కోహ్లి సేనకు జరిమానా విధించడం ఇది రెండోసారి. ఇంతకముందు వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ విధించిన సంగతి తెలిసిందే.
కాగా మూడో టీ20లో భారత్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మన్లలో మాథ్యూ వేడ్, మ్యాక్స్‌వెల్ రాణించారు. అనంతరం 187 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేయగలిగింది. కాగా ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి డే నైట్ టెస్టు మ్యాచ్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17 నుంచి జరగనుంది.