షాకింగ్.. క్వారంటైన్ ఆహారంలో పురుగులు.. బాధితులు గోడు.

దేశం మొత్తం కరోనాతో విలవిలలాడిపోతుంది. ముఖ్యంగా మ‌హారాష్ట్రలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల‌ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. రాష్ట్రంలో ముంబైతోపాటు పుణేలో క‌రోనా తీవ్ర‌త అధికంగా ఉంది. దీంతో పుణే న‌గ‌రంలో క‌రోనా వైర‌స్ వేగంగా విస్త‌రిస్తున్న వేపథ్యంలో క‌రోనా అనుమానితుల‌తోపాటు.. పాజిటివ్‌గా తేలిన వ్య‌క్తుల‌ను స‌ర్దార్ వ‌ల్లాభాయ్ ప‌టేల్ కంటోన్మెంట్ జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇక్క‌డ అందిస్తున్న ఆహారంలో నాణ్య‌త లోపించినట్లు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆహారంలో పురుగులు వ‌స్తున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆస్ప‌త్రిని పుణే కంటోన్మెంట్ బోర్డు నిర్వ‌హిస్తోంది.

ఆస్ప‌త్రి అందించే ఆహారంలో నాణ్య‌త పాటించ‌డం లేద‌ని రోగులు ఫిర్యాదు చేస్తుండటం సంచలనం రేపుతుంది. అలాగే… చ‌పాతీల్లో వెంట్రుక‌లు వ‌స్తున్నాయ‌ని.. ఆక‌లి బాధ‌కు త‌ట్టుకోలేక ఆన్‌లైన్‌లో ప్ర‌య‌త్నిస్తుంటే.. కంటైన్‌మెంట్ జోన్ కావ‌డంతో డెలీవ‌రిల‌కు అధికారులు ఒప్పుకోవ‌డం లేద‌ని ఆయా వ్య‌క్తులు వెల్లడిస్తున్నారు.

కాగా ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధితో పోరాడుతున్న తాము ఇలాంటి నాసిక‌రం ఆహారంతో రోగ నిరోధ‌క శ‌క్తిని ఎలా పెంపొందిచుకోగ‌ల‌మ‌ని కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా ఇలాంటి ఘ‌ట‌న‌ల‌పై దృష్టి సారించాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఈ మధ్య ఐసీయూ, కోవిడ్‌-19 రోగుల చికిత్స కోసం రూ.2.5 కోట్ల‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం న‌గ‌ర‌వ్యాప్తంగా 25 మంది ఈ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఓ స్వచ్చంద సంస్థ అందించిన ఆహారంలో పొరపాటు జరిగిందని.. ఇకమీదట అలాంటివి రావని.. పలు జాగ్రత్తలు తీసుకుంటామని ఆస్పత్రి నిర్వాహకులు వెల్లడించారు.