సిద్దిపేటలో రౌడీషీటర్ దారుణ హత్య.. అది ఆ గ్యాంగ్ పనేనా..?

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఎల్లంగౌడ్ అనే రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు అతడిని అత్యంత కిరాతకంగా తలను నరిచి చంపారు. లాక్‌డౌన్ సమయంలో నేరాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని పోలీసులు చెప్తుంటే.. నేరస్థులు మాత్రం తెగబడుతున్నారు. కొద్దిరోజులుగా హత్యలు, అత్యాచారాలు, దాడులు లేకుండా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో నేరాలు ఘోరంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఓ రౌడీషీటర్ దారుణహత్యకు పాల్పడ్డాడు. ప్రత్యర్థులు అతడిని తలను వేరు చేసి అతికిరాతకంగా చంపేశారు.

కాగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామ శివారులో ఓ వ్యక్తి మృతదేహాన్ని దారుణమైన స్థితిలో గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడిని సిద్దిపేట మండలం ఇమాంబాద్ గ్రామానికి చెందిన అంబటి ఎల్లంగౌడ్‌గా గుర్తించారు. అతడిపై గతంలోనే అనేక కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. కాగా 2014లో శామీర్‌పేట మండలం మజీద్‌పూర్ చౌరస్తా సమీపంలోని బావర్చి హోటల్ వద్ద ఎల్లంగౌడ్ గ్యాంగ్ పోలీసులపై కాల్పులు జరిపింది.

ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లా సళంత్రి‌కి చెందిన ఈశ్వర్ అనే కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఎల్లంగౌడ్‌పై కర్ణాటక, మహారాష్ట్రలోనూ అనేక కేసులున్నట్లు సమాచారం అందుతుంది. పలు హత్యలు, సెటిల్‌మెంట్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎల్లంగౌడ్‌కు శత్రవులు కూడా దండిగానే ఉన్నారు. ప్రధానంగా వెంకట్‌ గ్యాంగ్‌తో అతడిని డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఇది అతని పనే అంటున్నారు కొంతమంది. మరి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.