భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పూర్తి మ్యాచ్ ఫిట్నెస్ సంతరించుకున్నట్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) తెలిపింది. అతను పోటీ క్రికెట్ ఆడుకోవచ్చని ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో వాయిదా పడిన ఐపీఎల్ సహా ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌నకు అతను అందుబాటులో ఉంటాడు. మార్చిలో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా అయ్యర్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే.
‘‘గాయం నుంచి కోలుకునేందుకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యుద్ధానికి రెడీ. ఆడటానికి సిద్ధం. ఇక రాబోయే కాలంలో బ్యాట్ మాట్లాడుతుంది’’ అంటూ తన ఆగమనాన్ని ఘనంగా చాటుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు శ్రేయస్ ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్ గాయపడటంతో అతడి స్థానంలో టీమిండియా యువ కెరటం రిషభ్ పంత్ సారథ్య బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే.