ఐపీఎల్-2022 సీజన్ మెగా వేలం ముందు రిటన్షెన్ పక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ రిటన్షెన్ జాబితాలో చాలా మంది స్టార్ ఆటగాళ్ల పేర్లు లేవు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే.. ఆజట్టు మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను రీటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో జనవరిలో జరగనున్న మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ కోసం చాలా ఫ్రాంచైజీలు భారీగా పోటీ పడే అవకాశం ఉంది. కాగా వచ్చే సీజన్‌లో రెండు కొత్త జట్లు చేరడంతో ఐపీఎల్ మరింత రసవత్తరంగా జరగనుంది.
ఇక ఈ జట్లుకు కెప్టెన్లుగా ఎవరు ఉండబోతున్నారనే అన్నదానిపై సర్వత్రా అసక్తి నెలకొంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వార్త హాల్‌చల్ చేస్తుంది. అహ్మదాబాద్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించబోతున్నాడనేది ఆ వార్త సారాంశం. ఇప్పటికే అహ్మదాబాద్ ఫ్రాంచైజీతో శ్రేయస్ అయ్యర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ‘ఫ్రీ టికెట్’ ద్వారా శ్రేయస్‌ను నేరుగా ఎంపిక చేసుకోనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
శ్రేయస్‌కు అహ్మదాబాద్ ఏకంగా రూ.15 కోట్లు ఆఫర్ చేసిందని జోరుగా ప్రచారం జరుగుతుంది. కాగా ఐపీఎల్-2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్సీనుంచి తప్పించి రిషబ్ పంత్‌కు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్-2022 కోసం మెగా వేలం జనవరిలో ప్రారంభం కానుంది. అయితే ఈ సారి రెండు కొత్త జట్లు రావడంతో వేలంపై ప్రాధాన్యత సంతరించుకుంది.