పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రాధేశ్యామ్ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం, హీరోయిన్ పూజ హెగ్డేతో కలిసి ప్రభాస్ వరస ఇంటర్య్వూల్లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ నేపథ్యంలో ఆయన పెద్దమ్మ, కృష్ణం రాజు సతిమణి శ్యామల దేవి ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ ప్రభాస్‌కు ఇష్టమైన వంటకం ఏంటో బయట పెట్టింది. ఈ మేరకు శ్యామల దేవి ప్రభాస్ పులస చాప కూర అంటే ఇష్టమని, దీనితో ఇష్టంగా భోజనం చేస్తాడని తెలిపింది.
‘ప్రభాస్‌కు ఆయన పెద్దనాన్న అంటే చాలా ఇష్టం. ఎంత బిజీగా ఉన్న పెద్దనాన్నను తరచూ కలుస్తూనే ఉంటారు. కొడుకుని చూడగానే ఆయన కూడా ఫుల్ ఖుషి అవుతారు.ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది ఆయనకు. ఎలాంటి పరిస్థితులో అయిన తండ్రికొడుకులు తప్పకుండా కలుసుకుంటారు. సుమారు రెండు, మూడు గంటలు మాట్లాడుకుంటారు. ప్రభాస్ ఆయనను పెద్ద బాజీ అని, నన్ను కన్నమ్మ అని పిలుస్తాడు’ అంటూ చెప్పకొచ్చింది.
ప్రభాస్‌కు ఏమైనా లెటర్స్, ఫోన్స్ వస్తాయా అని అడగ్గా.. ‘బాబోయ్ చాలా ఫోన్ కాల్స్ వస్తాయి, అమ్మాయిల నుంచి మరి ఎక్కువ. అంతేకాదు వాళ్ల పేరేంట్స్ కూడా చేస్తుంటారు. కావాలంటే జాబ్ మానేస్తాం, అక్కడి వచ్చేస్తాం అంటారు. కానీ వాళ్లందరి మీ కెరీర్ చూసుకొండని, జీవితం నాశనం చేసుకోవద్దు’ అని నచ్చ చెబుతుంటానని ఆమె అన్నారు. అంతేగాక ప్రభాస్‌కు చాలా మోహమాటమని, అమ్మాయిలతో అసలు మాట్లాడడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అందుకే ఆ ఫోన్ కాల్స్ అన్ని తానే ఎత్తి మాట్లాడతానంటూ ఆమె స్పష్టం చేశారు.
ఇక భర్త కృష్ణం రాజు గురించి మాట్లాడుతూ.. రాధేశ్యామ్ షూటింగ్లో కృష్ణం రాజుకు గాయమైందని, అయినా రెస్ట్ తీసుకొకుండా ఆయన షూటింగ్ పూర్తి చేశారని చెప్పింది. అప్పటి నుంచి తాను కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం సప్త శనివార వ్రతం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక కృష్ణం రాజు శివుడు, భక్త కన్నప్పను ఆరాధిస్తారని… తాను విష్ణువు, పార్వతీదేవిని ఆరాధిస్తానని ఆమె చెప్పుకొచ్చింది. కాగా రాధేశ్యామ్‌లో కృష్ణం రాజు మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ మార్చి11న విడుదలవుతోంది.