తూత్తుకుడిలో అలా… ఉత్తరాఖండ్ లో ఇలా…

SI Gagandeep save Muslims boy from Angry Hindu People in Uttarakhand

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విధి నిర్వ‌హ‌ణ‌లో పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. ఏదైనా ప్ర‌మాదమో, మ‌రేదైనా దుర్ఘ‌ట‌నో జరిగింద‌న్న స‌మాచారం తెలియ‌గానే హుటాహుటిన అక్క‌డకు చేరుకుని… విధులు నిర్వ‌ర్తిస్తారు. ఆ స‌మ‌యంలో వారు త‌మ గురించి ఏ మాత్రం ఆలోచించుకోరు. ప్రాణ‌భ‌యంతో వెనుకంజవేయరు. ప‌రిస్థితిని అదుపులోకి తీసుకురావ‌డానికి, నిందితుల‌ను ప‌ట్టుకోడానికి శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌య‌త్నిస్తారు. అరాచ‌క శ‌క్తుల్ని అడ్డుకునే క్ర‌మంలో కొన్నిసార్లూ ప్రాణాలూ కోల్పోతుంటారు. అయినా స‌రే స‌మాజంలో పోలీస్ అన‌గానే ఎవ‌రికీ వారి త్యాగాలు గుర్తురావు… పోలీసులంటే ఒక ర‌క‌మైన వ్య‌తిరేక భావం, భ‌యమే నెల‌కొని ఉంటుంది. అయితే కొన్ని సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు మాత్రం ఆయా సంద‌ర్భాల‌ను బ‌ట్టి పోలీసుల‌పై ప్ర‌శంస‌లు, విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయి.

తాజాగా దేశంలో పోలీసుల‌పై ఒక‌ర‌క‌మైన వ్య‌తిరేక‌భావం నెల‌కొని ఉంది. దీనికి కార‌ణం త‌మిళ‌నాడులోని తూత్తుకుడిలో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు. ఆందోళ‌న‌కారుల‌ను అదుపుచేయాల‌న్న ఉద్దేశంతో పోలీసులు విచ‌క్ష‌ణర‌హితంగా ప్ర‌వ‌ర్తించారు. ఇష్టానురీతిగా కాల్పులు జ‌రిపి 13 మంది ప్రాణాలు బ‌లితీసుకున్నారు. తూత్తుకుడి దారుణంలో పోలీసుల వ్యాఖ్య‌లు, ప్ర‌వ‌ర్త‌నకు సంబంధించిన కొన్ని వీడియోలు రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూ ర‌క్ష‌క‌భ‌టుల‌పై అంద‌రికీ ఆగ్ర‌హం తెప్పిస్తున్నాయి. అన్ని వ‌ర్గాల వారూ పోలీసుల‌పై విమ‌ర్శ‌లు కురిపిస్తున్న వేళ ఇదే సోష‌ల్ మీడియాలో ఓ పోలీస్ అధికారి హీరో అనిపించుకున్నారు. పోలీస్ అన్న ప‌దానికి నిజ‌మైన నిర్వ‌చ‌నం ఇచ్చిన ఆ హీరోపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇంత‌గా అంద‌రూ ఆయ‌న్ను పొగ‌డ‌డానికి కార‌ణం ఆ పోలీస్… సినిమా హీరోలా ఓ యువ‌కుణ్ని కాపాడ‌ట‌మే…

వివ‌రాల్లోకి వెళ్తే… ఉత్త‌రాఖండ్ రామ్ న‌గ‌ర్ లోని జిమ్ కార్బెట్ టైగ‌ర్ రిజర్వ్ ప్రాంతం ప‌ర్యాట‌కుల‌తో సంద‌డిగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ద‌గ్గ‌ర‌లో గిరిజాదేవి ఆల‌యం ఉంది. ఈ ఆల‌యం వ‌ద్ద ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని గ‌గ‌న్ దీప్ సింగ్ అనే ఎస్సైకి ఈ నెల 22న స‌మాచారం అందింది. ఓ ముస్లిం యువ‌కుడు తాను ప్రేమించిన హిందూ యువ‌తిని క‌లుసుకుని మాట్లాడ‌డం యువ‌కుల‌కు కోపం తెప్పించింది. వారిద్ద‌రూ క‌లుసుకోవ‌డం న‌చ్చ‌ని హిందూ యువ‌కులు ముస్లిం అబ్బాయి మీద‌కు దూసుకొచ్చారు. వారి మ‌ధ్య గొడ‌వ తీవ్ర రూపం దాల్చి ఆ యువ‌కుడి మీద దాడిచేశారు. ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం గురించి తెలుసుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు.

గ‌గ‌న్ దీప్ సింగ్ ముస్లిం యువ‌కుడికి ఓ క‌వ‌చంలా నిల‌బ‌డి దాడిని అడ్డుకున్నారు. దాంతో అక్క‌డ గుంపుగా ఉన్న వారందరూ పోలీసుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. అయిన‌ప్ప‌టికీ గ‌గ‌న్ వారందరికీ స‌ర్ది చెప్పి ఘ‌ర్ష‌ణ జ‌ర‌గ‌కుండా నివారించారు. ఆ జంట‌ను స్టేష‌న్ కు తీసుకువెళ్లిన గ‌గ‌న్ అనంత‌రం ఆ అమ్మాయిని త‌ల్లిదండ్రుల‌తో పాటు ఇంటికి పంపించివేశారు. సంఘ‌ట‌నా స్థ‌లంలో గ‌గ‌న్ ముస్లింయువ‌కుడికి దెబ్బ‌లుత‌గ‌ల‌కుండా త‌న శ‌రీరాన్ని అడ్డుపెట్టి కాపాడ‌డాన్ని ఎవ‌రో వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప‌లువురు నెటిజ‌న్లు గ‌గ‌న్ ను హీరో అంటూ కొనియాడుతున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌వాది ఒక‌రు గ‌గ‌న్ ధైర్య‌సాహ‌సాల‌ను ఎంత‌గానో ప్ర‌శంసించారు. ఆగ్ర‌హంతో ఉన్న గుంపునుంచి ఓ యువ‌కుడిని కాపాడిన గ‌గ‌న్ దీప్ ధైర్య‌సాహ‌సాలు అమోఘం అని పొగిడారు. మొత్తానికి గ‌గ‌న్ దీప్ త‌న వైఖ‌రితో సోష‌ల్ మీడియా హీరో అయ్యారు.