విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ ఆత్మహత్య

విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ ఆత్మహత్య

విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకోవడం శుక్రవారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. హాసన్‌ జిల్లా చెన్నరాయపట్టణ రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా పనిచే సే కిరణ్‌ కుమార్‌ (34) శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆయన ఆత్మహత్యకు నిర్ధిష్ట కారణాలు అయితే తెలియరాలేదు.

కానీ తన పోలీసు స్టేషన్‌ పరిధిలో కేవలం 24 గంటల వ్యవధిలో రెండు వరుస హత్యలు జరగడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారని కొందరు, ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మరికొందరు చెబుతున్నారు. ఏదీఏమైనా ఒక యువ ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం మాత్రం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్థానికుల కథనాల ప్రకారం గడిచిన 24 గంటల వ్యవధిలో చెన్నరాయపట్టణ రూరల్‌ పోలీసు
స్టేషన్‌ పరిధిలో రెండు వరుస హత్యలు జరిగాయి.

ఈ నేపథ్యంలో పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ హత్యలు జరుగుతున్నాయని సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఎస్సై కిరణ్‌ కుమార్‌ మనస్తాపానికి గురయ్యాడు. అంతేకాకుండా ఈ వరుస హత్యల ఉదంతంతో ఎస్పీ శ్రీనివాసగౌడ శుక్రవారం చెన్నరాయనపట్టణకు రానున్నడం, ఎస్పీకి ఏమని సమాధానమివ్వాలని ఎస్సై మదన పడడంతో పాటు సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై కిరణ్‌ కుమార్‌ ఉరి వేసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

మరోవైపు శుక్రవారం వరమహాలక్ష్మి పండుగ కావడంతో కిరణ్‌ కుమార్‌ భార్య పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎస్సై ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడు. కిరణ్‌ ఆత్మహత్య విషయం తెలుసుకున్న హెచ్‌డీ రేవణ్ణ చెన్నరాయనపట్టణకు చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. ఈ కేసుపై పూర్తి దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు.