మక్కామ‌సీదు పేలుడు ఘ‌ట‌న‌లో అనూహ్య తీర్పు…

SIA court verdicts Mecca Masjid Bomb blast case 5 accused's release by the court

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

స‌రిగ్గా 11 ఏళ్ల క్రితం హైద‌రాబాద్ లో పెను సంచ‌ల‌నం సృష్టించిన మ‌క్కామ‌సీదు పేలుళ్ల కేసులో ఎన్ ఐఏ కోర్టు ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన తీర్పు వెలువ‌రించింది. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితుల‌ను ఏన్ ఐఏ ప్ర‌త్యేక కోర్టు నిర్దోషులుగా ప్ర‌క‌టించింది. నేరాన్ని రుజువు చేసేటంత బ‌ల‌మైన సాక్ష్యాల‌ను నిందితుల‌కు వ్య‌తిరేకంగా కోర్టుకు స‌మ‌ర్పించ‌డంలో సీబీఐతో పాటు ఎన్ ఐఏ విఫ‌లమ‌వ‌డంతో… వారంతా నిర్దోషులుగా బ‌య‌ట‌ప‌డ్డారు. నిందితులుగా ఉన్న దేవేంద‌ర్ గుప్తా, లోకేశ్ శ‌ర్మ‌, స్వామి అసీమానంద‌, భ‌ర‌త్ భాయి, రాజేంద‌ర్ చౌద‌రిపై అభియోగాలు నిరూపించ‌డంలో ప్రాసిక్యూష‌న్ విఫ‌లమ‌యింద‌ని న్యాయ‌స్థానం వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పుపై ఎన్ ఐఏ హైకోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ కేసు వివ‌రాల్లోకెళ్తే…2007, మే 18న మ‌ధ్యాహ్నం 1.15 గంట‌ల స‌మ‌యంలో మ‌క్కామ‌సీదు ఆవ‌ర‌ణ‌లో ముస్లింలు శుక్ర‌వారం ప్రార్థ‌న‌లు జ‌రుపుకుంటున్నవేళ వ‌జూఖానా వ‌ద్ద ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్ బాంబును పేలడంతో 9మంది మ‌ర‌ణించారు. 58 మంది గాయ‌ప‌డ్డారు. అక్క‌డికి స‌మీపంలో పేల‌ని మ‌రో ఐఈడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘట‌న జ‌రిగిన స‌మ‌యంలో మ‌సీదులో సుమారు 5వేల‌మందికి పైగా ఉన్నారు. పేలుడు అనంత‌రం జరిగిన అల్ల‌ర్ల‌ను అణిచివేసేందుకు పోలీసులు జరిపిన‌ కాల్పుల్లో మ‌రో 9 మంది మృతిచెందారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టింది. అయితే ఉగ్ర‌వాద చ‌ర్య కావ‌డంతో ద‌ర్యాప్తు బాధ్య‌త‌ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2011 ఏప్రిల్ 4న ఎన్ ఐఏకు అప్ప‌గించింది. రెండు కేసుల్ని తిరిగి న‌మోదుచేసిన ఎన్ ఐఏ మొత్తం ప‌దిమంది నిందితుల్ని గుర్తించింది. 2014 ఫిబ్ర‌వ‌రి 13న నిందితుల‌పై అభియోగాలు న‌మోద‌య్యాయి. ఈ కేసులో తొలుత సీబీఐ 2010 జూన్ 17న రాజ‌స్థాన్ కు చెందిన దేవేంద్ర గుప్తా అలియాస్ బాబీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన లోకేశ్ శ‌ర్మ అలియాస్ అజ‌య్ తివారీని అరెస్టు చేసింది.

అదే ఏడాది నవంబ‌ర్ 19న కీల‌క నిందితుడు నాబ‌కుమార్ స‌ర్కార్ అలియాస్ అసీమానంద పోలీసులు చిక్క‌డంతో మ‌క్కామ‌సీదు పేలుడు వెన‌క కుట్ర కోణం బ‌హిర్గ‌త‌మ‌యింది. దేశంలో ఒక వ‌ర్గం ప్ర‌జ‌ల్ని ల‌క్ష్యంగా చేసుకుని మ‌రో వ‌ర్గం పేలుళ్ల‌కు పాల్ప‌డుతోంద‌నే కార‌ణంతో మ‌క్కామ‌సీదు పేలుడు ఘ‌టన‌కు ఒడిగ‌ట్టిన‌ట్టు తేలింది. త‌ర్వాత 2011 డిసెంబ‌ర్ 3న గుజ‌రాత్ వ‌ల్సాద్ కు చెందిన భార‌త్ మోహ‌న్ లాల్ ర‌తేశ్వ‌ర్ అలియాస్ భార‌త్ భాయి, 2013 మార్చి 2న మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన రాజేంద‌ర్ చౌద‌రి అలియాస్ స‌ముంద‌ర్ పోలీసుల‌కు చిక్కారు. పేలుడు ఘ‌ట‌న‌లో ప్ర‌మేయ‌మున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఇండోర్ కు చెందిన సందీప్ వి డాంగే అలియాస్ వాసుదేవ్, రామ‌చంద్ర క‌ల్సంగ్రా రాంజీ అలియాస్ ఓంజీ మాత్రం ఇప్ప‌టికీ దొర‌క‌లేదు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ దేవాస్ కు చెందిన మ‌రో నిందితుడు సునీల్ జోషీ పేలుడు జ‌రిగిన 2007లోనే హ‌త్య‌కు గుర‌య్యాడు. ఈ కేసులో విచార‌ణ అధికారులు మొత్తం 2,500 పేజీల ఛార్జ్ షీట్ దాఖ‌లు చేసి, 234 మంది సాక్షుల‌ను కోర్టుముందు ప్ర‌వేశ‌పెట్టారు. దాదాపు 11 ఏళ్ల పాటు సాగిన విచార‌ణ‌లో ఏ ఒక్క సాక్షీ నిందితుల ప్ర‌మేయం గురించి త‌మ‌కు క‌చ్చితంగా తెలుస‌ని కోర్టు ముందు నిరూపించ‌లేక‌పోయారు. దీంతో ఎన్ ఐ ఏకోర్టు న్యాయ‌మూర్తి ఐదుగురు నిందితుల‌పై ఉన్న కేసులను కొట్టివేస్తూ వారిని నిర్దోషులుగా విడుద‌ల‌చేస్తున్న‌ట్టు తీర్పు ఇచ్చారు.

మొత్తం ప‌దిమంది నిందితుల్లో ఐదుగురు నిర్దోషులుగా తేల‌గా… మ‌రో ఇద్దరు నిందితులు ఇప్ప‌టికే బెయిల్ పై ఉన్నారు. మ‌రో ముగ్గురిపై మాత్రం వేర్వేరు కేసులు ఉన్నందున వారు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం లేదు. మొత్తానికి సుదీర్ఘ విచార‌ణ త‌ర్వాత తీర్పు నిందితుల‌కు అనుకూలంగా వెలువ‌డ‌డం గ‌మ‌నార్హం. తీర్పుపై వారంతా ఆనందం వ్య‌క్తంచేస్తున్నారు. అటు కోర్టు తీర్పు నేప‌థ్యంలో హైద‌రాబాద్ లో పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటుచేశారు. పాత‌బ‌స్తీ ప‌రిస‌రాల్లో ఉద‌యం నుంచి 2వేల‌మందితో బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్న పోలీస్ శాఖ తీర్పు త‌ర్వాత మ‌రిన్ని బ‌ల‌గాల‌ను రంగంలోకి దించింది. కోర్టుతీర్పుతో పాత‌బ‌స్తీలో అల్ల‌ర్లు జ‌ర‌గ‌వ‌చ్చ‌న్న పుకార్ల నేప‌థ్యంలో ప‌లు చౌర‌స్తాల్లో పోలీసులు అనుమానితుల‌ను త‌నిఖీలు చేస్తున్నారు.