ప్రేక్షకుల అభిమానం పూర్తిస్థాయిలో పొందేందుకు 12 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చిందని డీజే టిల్లు హీరో సిద్ధు అన్నారు. సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో డీజే టిల్లు సినిమా విజయోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా పరిశ్రమలో ఏదో సాధించాలని ప్రతి ఒక్క నటుడు, డైరెక్టర్, రచయితకు ఉంటుందని.. ఈ రోజు అందరి కల నెరవేరిందన్నారు.
గుంటూరు టాకీస్ సినిమా విజయం సాధించినా.. అనుకున్నంత పేరు రాలేదన్నారు. ఎన్నో భయాందోళన పరిస్థితుల మధ్య డీజే టిల్లు సినిమాను చిత్రీకరించామన్నారు. ఆ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినిమాలోని డైలాగ్ చెప్పి ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ నేహా మాట్లాడుతూ వైజాగ్‌లో వేరే సినిమా షూటింగ్‌లో ఉన్న సమయంలోనే.. డీజే టిల్లు సినిమా కోసం ఆఫర్ వచ్చిందన్నారు.
ఇప్పుడు అదే సిటీలో సినిమా విజయోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. డైరెక్టర్ విమల్ మాట్లాడుతూ తన స్కూల్ ఫంక్షన్లు ఇదే సిటీలో జరిగాయని, ఇక్కడే వేదికలపై చాలా సార్లు డ్యాన్స్‌లు చేశానని గుర్తు చేసుకున్నారు. వైజాగ్‌కు చెందిన తనను ఈ వేదికపై నిలబెట్టిన సినీ అభిమానులకు రుణపడి ఉంటానన్నారు. అనంతరం భువనేష్ అనే అభిమానికి హీరో సిద్ధు తన జాకెట్‌ను బహుమతిగా అందించారు. సినిమా టైటిల్ సాంగ్‌కు హీరో హీరోయిన్లు డ్యాన్స్ చేసి అభిమానుల్లో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వంశీ, ఇతర నటులు పాలొన్నారు.