Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు చరిత్ర సృష్టించింది. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో ఘనవిజయం సాదించింది. ప్రపంచ చాంపియన్ షిప్ ఫైనల్లో తనపై గెలిచిన జపాన్ క్రీడాకారిణి నజోమీ ఒకుహరను కొరియా ఓపెన్ ఫైనల్లో ఓడించడం ద్వారా టైటిల్ తోపాటూ ప్రతీకారమూ తీర్చుకుంది సింధు. గంటా 23 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. సింధు ఒకుహరా హోరాహోరీ తలపడ్డారు.
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఒకుహరగాకు సింధు దీటుగా బదులిచ్చింది. తొలి గేమ్ ను 22-20తో కైవసం చేసుకున్న సింధు రెండో గేమ్ లో కాస్త తడబడింది. రెండో గేమ్ లో ఒకుహర విజృంభించి ఆడడంతో 11-21 తో ఆ గేమ్ ను కోల్పోయింది సింధు. నిర్ణయాత్మక మూడో గేమ్ లో మళ్లీ పుంజుకుని 21-18తో కొరియా సిరీస్ టైటిల్ గెల్చుకుంది సింధు. తన కెరీర్ లో సింధు ఈ టైటిల్ గెలవడం ఇదే మొదటిసారి. అంతేకాదు…ఈ టైటిల్ గెలుచుకున్న మొదటి భారత క్రీడాకారిణి కూడా సింధూనే.