మరో రికార్డును అందుకున్న సింగరేణి సంస్థ

సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదనలో 200 మెగావాట్ల లక్ష్యాన్ని దాటడం ద్వారా సింగరేణి సంస్థ మరో రికార్డును అందుకుంది. బుధవారం కొత్తగూడెంలో ప్రారంభించిన 37 మెగావాట్ల యూనిట్‌తో ఆ సంస్థ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి 219 మెగావాట్లకు చేరింది. సింగరేణి ఆధ్వర్యంలో 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 13 ప్లాంట్లను సంస్థ పరిధిలోని 8 ఏరియాల్లో నెలకొల్పాలని నిర్ణయించారు.

మూడు దశల్లో ఈ పాంట్ల ఏర్పాటు కోసం పలు కాంట్రాక్టు సంస్థలకు బాధ్యతలు అప్పజెప్పింది. మొదటిదశలో భాగంగా 129 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు ప్లాంట్లను బీహెచ్‌ఈఎల్‌ చేపట్టింది. ఆర్‌జీ–3లో 40, ఇల్లెందులో 39, మణుగూరులో 30, ఎనీ్టపీసీ ఆవరణలో 10 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాలు పూర్తయి ఇప్పటికే విద్యుత్‌ ఉత్పాదన చేస్తున్నారు. ఆర్‌జీ–3 ఏరియాలోని మరో 10 మెగావాట్ల ప్లాంటు వచ్చే నెలలో పూర్తి కానుంది.

ఇక, రెండో దశలో భాగంగా కొత్తగూడెంలో 37, మందమర్రి ఏ బ్లాక్‌లో 28, బి బ్లాక్‌లో 15, భూపాలపల్లిలో 10 మెగావాట్ల ప్లాంట్లు కూడా ఉత్పత్తి ప్రారంభించాయి. ఇప్పుడు కొత్తగూడెం ప్లాంటు కూడా ప్రారంభం కావడంతో సింగరేణి సోలార్‌ విద్యుదుత్పాదన సామర్థ్యం 219 మెగావాట్లకు చేరింది. ఇక, మూడోదశలోని 81 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాట్లను అదానీ, నోవాస్‌గ్రీన్‌ సంస్థలకు సింగరేణి అప్పగించింది.

ఇందులో సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని జలాశయంపై నీటితో తేలియాడే 15 మెగావాట్ల ప్లాంట్‌ నిర్మాణ పనులను నోవాస్‌గ్రీన్‌ ప్రారంభించింది. ఆర్‌జీ–3 ఓపెన్‌కాస్ట్‌ డంప్‌పై 22, డోర్లీ ఓపెన్‌కాస్ట్‌ డంప్‌పై 10 మెగావాట్లు, కొత్తగూడెం, చెన్నూరు ఏరియాల్లో నేలపై రెండు ప్లాంట్లను నిర్మిస్తున్నారు. వీటి పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి ఉత్పాదన ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

వాస్తవానికి దేశంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏ ప్రభుత్వరంగ సంస్థ కూడా ఇప్పటివరకు సోలార్‌ విద్యుదుత్పత్తి చేయడం లేదు. థర్మల్‌తో పాటు సోలార్‌ విధానంలో విద్యుత్‌ ఉత్పత్తిని చేస్తోంది సింగరేణి సంస్థ మాత్రమే. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే గ్రిడ్‌కు అనుసంధానమైన సోలార్‌ ప్లాంట్ల ద్వారా సెప్టెంబర్‌ 21 నాటికి 122.3 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అయింది.

ఈ విద్యుత్‌ను ట్రాన్స్‌కో లైన్లకు అనుసంధానం చేసి తనకు అవసరమైన మేర వినియోగించుకోవడంతో సంస్థకు రూ.75 కోట్ల మేర ఆదా అయింది. మొత్తం సంస్థ నిర్దేశించుకున్న 300 మెగావాట్ల లక్ష్యం పూర్తయితే ప్రతియేటా రూ.120 కోట్లు ఆదా అవుతాయని సింగరేణి వర్గాలు చెబుతున్నాయి.