సింగరేణి ప్యాసింజర్‌ ఏడు నెలల సుదీర్ఘ పోరాటం

సింగరేణి ప్యాసింజర్‌ ఏడు నెలల సుదీర్ఘ పోరాటం

దశాబ్దాల పాటు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చిన సింగరేణి ప్యాసింజర్‌ రైలు సర్వీసు తిరిగి ప్రారంభం కాబోతోంది. ఏడు నెలల సుదీర్ఘ పోరాటం అనంతరం ఫలితం లభించింది. 60 ఏళ్ల చరిత్ర ఉన్న రైలును వ్యయం తగ్గించే కార్యాచరణలో భాగంగా రద్దు చేశారు. దాని స్థానంలో పుష్‌ఫుల్‌ రైలును ప్రారంభించారు. నూతన రైలులో కొత్తగూడెం నుంచి సిర్పూర్‌కాగజ్‌నగర్‌ వరకు ఉన్న ప్రయాణికులు దాదాపు ఏడు నెలల పాటు అష్టకష్టాలు పడ్డారు. భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వే స్టేషన్‌కు వచ్చిన రైల్వే అధికారులకు వినతులు ఇచ్చి, సింగరేణి రైలును పున:ప్రారంభించాలని కోరారు.

కొత్తగూడెంలో అన్ని పార్టీల వారు అఖిలపక్షంగా ఏర్పడి దీక్షలు, ఐక్య ఉద్యమాలు చేపట్టారు. అందరి పోరాట ఫలితంగా సింగరేణి ప్యాసింజర్‌ రైలును పునఃప్రారంభించడానికి రైల్వే అధికారులు ఎట్టకేలకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. సింగరేణి ప్రాంతాలను కలుపుకుంటూ వెళ్లే సింగరేణి ప్యాసింజర్‌ రైలులో ఎక్కువగా సింగరేణి కార్మిక కుటుంబాలు, ఆయా ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునే రైతుల కుటుంబాలు ప్రయాణం చేస్తుంటాయి. ఈ నెల 6వ తేదీ నుంచి భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ స్టేషన్‌ వరకు పాత సింగరేణి ప్యాసింజర్‌ ప్రారంభం కానుంది. దసరా కానుకగా అంతా భావిస్తున్నారు. గతంలో మాదిరిగానే 14 కోచ్‌లతో నడువనుంది. ప్రతి కోచ్‌కు బాత్రూంలు, ప్రయాణికుల సామగ్రిని పెట్టుకోవడానికి సదుపాయం ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.