ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ హరిణి కుటుంబం అదృశ్యమైంది. వారం రోజుల నుంచి హరిణి కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. వారం నుంచి వారి ఫోన్ నంబర్లు కూడా స్విచ్చాఫ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం అనుమానస్పద స్థితిలో హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం లభ్యమైంది. బెంగళూరులోని రైల్వేట్రాక్‌పై ఏకే రావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఏకే రావు ఫ్యామిలీ నివాసముంటున్నారు. అంతేగాక ఏకే రావు సుజనా ఫౌండేషన్ సీఈఓగా, సుజనా గ్రూప్స్ లీగల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. ఏకే రావు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు సెక్షన్ 174 ప్రకారం అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
హరిణి ఓ ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్. ఆమె గాయని మాత్రమే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్, క్లాసికల్ డ్యాన్సర్ కూడా. తమిళం, తెలుగు, కన్నడ, మాలయాలం, హిందీ సినిమాల్లో 3500కు పైగా పాటలు పాడారు. ప్రముఖంగా తమిళంలో ఎక్కువ పాటలను పాడారు. మరో సింగర్ టిప్పును వివాహామాడారు. తెలుగులో మురారి సినిమాలోని ఎక్కడ ‘ఎక్కడ ఎక్కడ ఉంది తారాకా’… గుండుంబా శంకర్ సినిమాలో.. ‘ఏమంటారో నాకు నీకున్న ఇదిని’.. ఘర్షణ సినిమాలోని ‘అందగాడ అందగాడ’, అల్లుడు శీనులోని ‘నీలి నీలి కన్నుల్లోనా’ వంటి పాటలను ఆలపించారు.