టోర్నీల కోసం నేను సిద్ధంగా ఉన్నా

టోర్నీల కోసం నేను సిద్ధంగా ఉన్నా

బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌ పూసర్ల వెంకట (పీవీ) సింధు ఈ ఏడాది ఏ టోర్నీలోనూ బరిలోకి దిగే అవకాశం కనిపించడం లేదు. 2021లోనే మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టాలని ఆమె దాదాపుగా నిశ్చయించుకుంది. కరోనా విరామం తర్వాత ఆగస్టులోనే మళ్లీ శిక్షణ ప్రారంభించినా… సింధు ఇప్పటి వరకు టోర్నీ ఆడలేదు. ప్రస్తుతం జరుగుతున్న డెన్మార్క్‌ ఓపెన్‌ నుంచి కూడా తప్పుకుంది. జనవరిలో జరిగే ఆసియా ఓపెన్‌–1, 2లలో సింధు ఆడవచ్చు.

‘బ్యాడ్మింటన్‌కు చాలా రోజులుగా దూరం కావడం వెలితిగా అనిపిస్తోంది. అయితే రోజూ సాధన చేస్తున్నాను కాబట్టి పూర్తి ఫిట్‌గా ఉన్నాను. ఒకసారి ఆడటం మొదలు పెట్టాక అలవాటయ్యేందుకు ఒకటి లేదా రెండు వారాలు పట్టవచ్చు. అంతే తప్ప ఎలాంటి ఇబ్బందీ లేదు. టోర్నీల కోసం నేను సిద్ధంగా ఉన్నా. ఏడు నెలలుగా అందరూ ఆటకు దూరంగా ఉన్నారు కాబట్టి ఒక సవాల్‌గా అనిపించవచ్చు.

కానీ అందరి ఆట కూడా మెరుగు పడి ఉండవచ్చు. రాబోయే రోజుల్లో అంతా టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నవారే కాబట్టి ప్రతీ ఒక్కరి నుంచి గట్టి పోటీ తప్పదు. కోవిడ్‌–19తో ప్రపంచం మొత్తం ఆగిపోయింది కాబట్టి ఆటకు దూరమయ్యాననే బాధ లేదు. ఆటకంటే జీవితాలు ముఖ్యం’ అని సింధు వ్యాఖ్యానించింది.