కొత్తపల్లి మండలం ఎదురుపాడు గ్రామానికి చెందిన తిరుమలేశ్వరి అనే చెంచుగిరిజన మహిళ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. ఆస్తి కలిసి వస్తుందని ఆమెను సొంత అక్కనే భర్తతో కలిసి హత్య చేశారు. విచారణలో ఈ విషయం వెలుగుచూడటంతో ఆత్మకూరు సీఐ సుబ్రహ్మణ్యం బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జనార్ధన్‌కు జానకమ్మ, తిరుమలేశ్వరి అనే ఇద్దరు భార్యలు. వీరిద్దరు సొంత అక్కాచెల్లెల్లు. తిరుమలేశ్వరికి పిల్లలు కాలేదు. అయితే, ఈమెను అడ్డుతొలగించుకుంటే ఆస్తి కలిసి వస్తుందని భావించిన అక్క, బావ గత నెల మార్చి 25న భోజనంలో కుక్కల మందు కలిపి పెట్టారు.
దానిని భుజించిన తిరుమలేశ్వరి చనిపోవడంతో గుట్టుగా టీవీఎస్ ఎక్సెల్ బండిపై మృతదేహాన్ని తీసుకెళ్లి నల్లమల అటవీ పరిధిలోని రోళ్లపెంట వద్ద పారవేశారు. కొద్ది రోజుల క్రితం హతురాలి తల్లి తాటికొండ లక్ష్మీదేవి తన కుమార్తె కనిపించడం లేదని ఆత్మకూరు పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు భర్త జనార్దన్, సోదరి జానకమ్మపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేసినట్లు వారు అంగీకరించినట్లు సీఐ తెలిపారు. తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించి నిందితులను రిమాండ్‌కు పంపినట్లు ఆయన వెల్లడించారు.