దేవుడా ఎందుకీ కడుపుకోత.. ఒకేసారి ఇద్దరు బిడ్డల్ని తీసుకెళ్తావా..? నేనేం పాపం చేశా..’ అని ఓ మాృతమూర్తి గర్భశోకంతో తల్లడిల్లింది. వరుసగా రెండు రోజులు వారి అంత్యక్రియలు నిర్వహించడం హృదయాలను కలచివేసింది. అక్కాచెల్లెళ్లు తమ చిన్నాన్న కూతురితో కలసి క్రిస్మస్ వేడుకలకు శనివారం రాత్రి స్కూటీపై వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు సోమవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. చిన్నాన్న కూతురు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల కడుపుకోతను చూసి బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
వివరాలు.. మొయినాబాద్ మండల పరిధిలోని రెడ్డిపల్లికి చెందిన మోర వెంకటేశ్, విజయలక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. వెంకటేశ్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా స్నేహితులతో కలసి వేడుక చేసుకునేందుకు శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో వెంకటేశ్ కూతుళ్లు ప్రేమిక , సౌమ్య , వారి చిన్నాన్న కూతురు అక్షయ స్కూటీపై వెళ్తున్నారు. అదే సమయంలో మద్యం మత్తులో అతివేగంతో చేవెళ్ల వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వీరి స్కూటీని ఢీకొట్టింది. దీంతో ప్రేమిక అక్కడికక్కడే మృతి చెందగా, సౌమ్య, అక్షయ తీవ్రంగా గాయపడ్డారు. సౌమ్య చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా.. అక్షయ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.