నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేడు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా ఉత్కంఠ పరిస్థితులు మారుతున్నాయి. రాజధానిని తరలింపు వద్దంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఇప్పటి వరకు ఆందోళనలు, నిరసనలకే పరిమితమైన రైతులు సకల జనుల సమ్మెతో కదం తొక్కుతున్నారు. రహదారిపై టెంట్‌లు వేసి మహాధర్నాలు చేపడుతున్నారు. మూడు రాజధానులు వద్దు…అమరావతే ముద్దు అంటూ నినాదాలతో హొరెత్తిస్తున్నారు.ఇలాంటి తరుణంలో…రాజధాని నియోజకవర్గమైన మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగిన లోకేష్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఎక్కడ చూసినా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. మందడంలో ధర్నా చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి పాల్పడ్డారని నిరసనలు వెల్లువెత్తాయి. మహిళలను బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనంలో ఎక్కించడంపై రైతులు మండిపడుతున్నారు. దీనికి కొనసాగింపుగా రాజధాని అమరావతి బంద్‌కు రైతులు పిలుపు ఇచ్చారు. ఇలా ఉద్రిక పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో టీడీపీ మాజీ మంత్రి, టీడీపీ నేత ఎమ్మెల్సీ నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారని అంటున్నారు.
ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి క్షేత్రస్థాయిలో రైతులకు, మహిళలకు మద్దతుగా నిలిచారు. ఏకంగా లోకేష్ తల్లి భువనేశ్వరి తన గాజులు ఇచ్చారు. ఈ చర్య రైతుల మనసును దోచుకుంది. ఇలా రాజధాని ప్రాంతంలో తమ పార్టీకి దక్కుతున్న ఆదరణ నేపథ్యంలో…మరోవైపు ఉద్రిక పరిస్థితుల నేపథ్యంలో రాజధాని రైతుల కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగి….అమరావతి సమస్యను చాటిచెప్పాలని…రైతులకు, స్థానికులకు అండగా నిలవాలని లోకేష్ యోచిస్తున్నట్లు సమాచారం. రాజధానిగా అమరావతిని కొనసాగించపోవడం, ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టంగా ఉన్న నేపథ్యంలో, లోకేష్ ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగినట్లే ప్రత్యక్షంగా లోకేష్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.