మరో సామూహిక ఆత్మహత్య…ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు !

six members of a family Commit suicide At jharkhand

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబంలోని 11 మంది సామూహిక ఆత్మహత్యల ఉదంతం మరవకముందే ఇదే తరహా ఘటన మరోటి వెలుగుచూసింది.జార్ఖండ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన జార్ఖండ్‌లోని హజారిబాగ్ నగరంలో చోటుచేసుకుంది. వీరిలో ఐదు మంది ఉరివేసుకుని మరణించగా, మరొకరు బిల్డింగ్ మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఘటనా స్థలంలో ఉన్న సూసైడ్‌నోట్‌ ఆధారంగా అప్పుల బాధతోనే కుటుంబం అంతా ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. డ్రై ఫ్రూట్ బిజినెస్‌లో భారీగా నష్టాలు రావడంతో ఒత్తిడికి లోనై వారంతా ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. మృతులు మహావీర్ మహేశ్వరీ(70), అతని భార్య కిరణ్ మహేశ్వరి(65), కొడుకు నరేశ్ అగర్వాల్(40), ఇతని భార్య ప్రీతీ అగర్వాల్(38), పిల్లలు అమన్(8), అంజలి(6)గా గుర్తించారు.