కరుడుగట్టిన నేరస్తులు ఉండే జైలు అది. వారిని బంధించిన జైలు చుట్టూ భారీ బందోబస్తు ఉంటుంది. అయితే ఇవన్నీ తమనేం చేయవని నేరస్తులు, దొంగలు నిరూపించారు. చిన్న వస్తువుదొరికితే చాలు వాటితో ఎలాగైనా తప్పించుకోగలరని చేసి చూపించారు. ఒక చిన్న చెంచాతో జైలు గోడలను తవ్వేసి బయట వరకు సొరంగం తవ్వేశారు. ఆ సొరంగ మార్గం నుంచి జైలు నుంచి బయటకు వచ్చారు. జులాయి సినిమాలో బ్రహ్మానందం ఒక ప్లేటును వంచి గోడను తవ్వేందుకు ప్రయత్నించడం నవ్వులు పూయించిన విషయం తెలిసిందే. ది శాశంక్ రిడంప్షన్ అనే హాలీవుడ్ సినిమాలో మాదిరి ఈ ఘటన ఇజ్రాయెల్‌లో చోటుచేసుకుంది.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని గిల్బోవా జైలు ఉంది. ఆ జైలులో కరుడుగట్టిన నేరస్తులను బందీగా ఉంచుతారు. ఆ జైలు లోపల, బయట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయినా కూడా ఆరుగురు ఖైదీలు భదత్రా దళాల కళ్లు గప్పి జైలు నుంచి పారిపోయారు. వారు పారిపోయేందుకు వాడిన ఒకటే ఆయుధం ‘తుప్పుపట్టిన చెంచా. వారు బందీగా ఉన్న జైలు గదిలోని మరుగుదొడ్డిలో ఖైదీలు తుప్పుపట్టిన చెంచాతో సొరంగం తవ్వకం మొదలుపెట్టారు. కొన్నేళ్లుగా అలా చేశారని సమాచారం. చివరకు సొరంగం పూర్తవడంతో సోమవారం ఆ ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు.జైలు నుంచి పొలాల వెంట పారిపోతుండగా రైతులకు కనిపించారు.
జైలు నుంచి పరారయ్యారని గుర్తించి వెంటనే జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు జైలులో గాలించగా ఆరుగురు పరారయ్యారని గుర్తించారు. పారిపోయిన వారిలో మాజీ మిలిటెంట్ నాయకుడు ఉన్నాడు. మిగతా ఐదుగురు గాజాకు చెందిన ఇస్లామిక్ జిహాద్‌కు చెందినవారుగా అధికారులు తెలిపారు. పారిపోయినవారంతా పాలస్తీనా వైపు వెళ్లి ఉంటారని అధికారులు చెబుతున్నారు. వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రధానమంత్రి నఫ్తాలీ బెనెట్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఖైదీలు పారిపోవడం భద్రతా లోపాలను ఎత్తి చూపింది. మరికొందరు పారిపోకుండా అప్రమత్తమైన అధికారులు మిగతా 400 మంది ఖైదీలను మరో చోటకు మార్చినట్లు సమాచారం.