‘పుష్ప’ బ్యాక్ టు హైదరాబాద్.. కారణం యూనిట్ సభ్యుల్లో కొందరికి కరోనా, ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఒకరు చనిపోయారు కూడా అనే వార్త ఒక్కసారిగా గుప్పుమంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం ‘పుష్ప’. కరోనా లాక్‌డౌన్ తర్వాత ఈ చిత్రం షూటింగ్‌ని రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి ఫారెస్ట్‌లో ప్రారంభించారు. సజావుగా సాగిన ఈ షూటింగ్‌కి కరోనా బ్రేక్ వేసిందన్నది వార్త. ‘‘మా యూనిట్‌లో నలుగురికి కరోనా అని నిర్ధారణ అయింది. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదు.
రికవర్ అవుతున్నారు’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. షెడ్యూల్స్ వివరాలకు వస్తే.. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 5 వరకూ మారేడుమిల్లిలో చిత్రీకరణ ప్లాన్ చేశారు. అయితే బుధవారం నలుగురికి కరోనా అని తేలడంతో ఎలానూ మూడు రోజుల్లో అక్కడ షెడ్యూల్‌కి ప్యాకప్ చెప్పేయాలి కాబట్టి, చిన్న బ్రేక్ ఇచ్చి యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. ఈ నెల 12న హైదరాబాద్‌లో షూటింగ్ ఆరంభిస్తారు. ఆ తర్వాత జనవరిలో మళ్లీ మారేడుమిల్లి ఫారెస్ట్‌లో షెడ్యూల్ మొదలుపెడతారు. అక్కడ భారీ షెడ్యూల్ జరుగుతుంది. రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సీఈవో: చెర్రీ, సహనిర్మాత: ముత్తంశెట్టి మీడియా.