పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేసిన స్కూటీలోకి దూరిన తాచుపామును బయటకు రప్పించేందుకు మెకానిక్ రెండు గంటల పాటు శ్రమించాడు. దానిని బటయకు రప్పించి పట్టుకుని వెళ్లి అడవిలో వదిలిన ఘటన కేసముద్రం మండల కేంద్రంలోని జెడ్పీఎస్‌ఎస్‌లో జరిగింది. ఉపాధ్యాయురాలు సునీత రోజు మాదిరిగానే స్కూటీపై వచ్చి పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేసింది.
ఈ క్రమంలో ముళ్లపొదల నుంచి వచ్చి స్కూటీలోకి దూరిన పామును విద్యార్థులు గమనించి, ఉపాధ్యాయులకు తెలిపారు. దానిని బయటకు రప్పించేందుకు ఉపాధ్యాయులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో అమీనాపురం గ్రామానికి చెందిన బైక్‌మెకానిక్ విజయ్‌ని పాములు పట్టే వ్యక్తి కుమారస్వామి పిలిపించాడు. ఆయన రెండు గంటల పాటు శ్రమించి స్కూటీ పార్టులన్నీ విప్పి పామును బయటకు రప్పించాడు. కాగా కుమారస్వామి పామును పట్టుకుని వెళ్లి అడవిలో వదిలేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.