మంచు తుఫాన్ దాటికి ఉత్తర అమెరికా గడ్డకట్టుకుపోతుంది. చలి గాలుల తీవ్రత, భారీగా కురుస్తున్న మంచుతో వందళ ఏళ్ల రికార్డులు బ్రేకవుతున్నాయి. జనజీవనం ఎక్కడిక్కడ స్థంభించిపోయింది. అమెరికాలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న పది రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కిటీకీలు, తలుపులు తెరవడానికి వీలులేనంతగా మంచు పేరుకుపోయి గడ్డకట్టిపోతుంది.
చలి గాలులు బలంగా వీస్తుండటంతో సముద్రం పోటెత్తుతోంది. చాలా వరకు తీర ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. దీనికి తోడు ఉత్తర అమెరికాలో చాలా చోట్ల కరెంటు కోత కూడా మొదలైంది. దీంతో సహాయం చేయాలంటూ ఎమర్జెన్సీ సర్వీస్‌లకు కాల్స్ పోటెత్తుతున్నాయి. మసాచుసెట్స్ ఏరియాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సుమారు పది లక్షల మంది ప్రజలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
న్యూయార్క్ సెంట్రల్ పార్కులో వందేళ్ల రికార్డు బద్దలైంది. ప్రసిద్ది చెందిన ఈ పార్కులో గతంలో అత్యధిక మంచు 1904 జనవరి 29న 4.7 అంగులాల మందం కురిసింది. ఇప్పటి వరకు ఇదే హయ్యస్ట్‌గా కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుత మంచు తుఫాను దాటికి ఇప్పటికే 7.3 ఇంచుల మందంతో మంచు పేరుకుపోయింది.
న్యూజెర్సీలో 1987లో అత్యధికంగా 20.3 అంగులాల మంచు కురిసింది. ఆ తర్వాత 2014లో 7.4 ఇంచులు మంచు కురిసింది. ఈసారి ఏకంగా 33.2 ఇంచులు మందంతో మంచు పేరుకుపోయింది. న్యూజెర్సీలో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి.ఫిలడేల్ఫియాలో 1904లో 5 ఇంచుల మంచు కురవడం ఇప్పటి వరకు రికార్డుగా ఉండగా తాజాగా 5.8 ఇంచుల మంచుతో పాత రికార్డుకు పాతర పడింది.
మంచు తీవ్రత దాటికి పొలాలు, ఊర్లు, చెరువులు, గుట్టలు అంతా తెల్లగా మారిపోవడంతో విమాన సర్వీసులు నిలిచిపోతున్నాయి. అమెరికాకు చెందిన ఫ్లైట్‌అవేర్ డాట్ కామ్ అందించిన వివరాల ప్రకారం ఇప్పటికే 5000లకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.