భార్యతో గొడవపడి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రామనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాల్తూరు గ్రామానికి చెందిన అల్లూరి నాగవెంకట సత్యభార్గవ్ (27) చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
కాగా సత్యభార్గవ్ నాలుగు నెలల క్రితం అదే జిల్లాకు చెందిన బంధువుల అమ్మాయి మంజును హైదరాబాద్ ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ చెన్నై వెళ్లి అక్కడే ఉద్యోగం చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ కావడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చెన్నై వెళ్లి ఇద్దరికి నచ్చజెప్పారు.
దీంతో ఈ ఏడాది జనవరిలో సత్యభార్గవ్ భార్య మంజుతో కలసి పటాన్చెరు మండల పరిధిలోని ఇంద్రేశం సాయికాలనీకి వచ్చి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో 21వ తేదీన సత్యభార్గవ్ భార్య మంజు గొడవపడ్డారు. దీంతో సత్యభార్గవ్ తన తమ్ముడికి ఫోన్ చేసి ఇంట్లో గొడవ జరిగిందని నేను స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు.
సోమవారం మృతుడి తమ్ముడు రవితేజ ఇంద్రేశం ఇంటికి రాగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా హాల్లో సీలింగ్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేçహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.