ప్రియుడి వంచనకు మరో యువతి బలైపోయింది. సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు గురి చేయడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిణి రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై సెప్టెంబర్ 18న జరగగా… ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం.. మేడిపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్వేత, లాలాపేటకు చెందిన అజయ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకుంటానని నమ్మబలికిన అజయ్ శ్వేతకు మరింత దగ్గరయ్యాడు. అనంతరం తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు.
ప్రేమ పేరుతో తీసుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో పెట్టి అజయ్ యువతిని వేధించసాగాడు. సోషల్ మీడియా నుంచి ఆ ఫొటోలు తొలగించేందుకు బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. తనతో దగ్గరగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో.. పరువు పోయిందని శ్వేత ఆవేదనకు గురైంది. గతంలో ఓసారి అజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పురాలేదు. నమ్మినవాడు మోసం చేయడం, వేధింపులకు దిగడం తీవ్ర అవమానంగా భావించిన శ్వేత బలవన్మరణానికి పాల్పడింది. కూతురు కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 19న మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులు శ్వేత ప్రియుడు అజయ్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది.