సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య

ఏడడుగులు.. మూడు ముళ్ల బంధం.. అగ్నిసాక్షిగా మనువాడి కడదాకా తోడుంటానన్న భర్తే.. ఆమె పాలిట కాల యముడవుతాడని ఆ ఇల్లాలు ఊహించలేకపోయింది. మరోవైపు ఏ పాపం తెలియని ఆ చిన్నారి ఇకముందు తల్లిదండ్రులు లేని అనాథగా మిగలింది. ఉద్యోగం లేకపోయిన భర్త అడగగానే డబ్బు ఇవ్వడమే ఆమెకు శాపమై తన ప్రాణం తీసింది.

తిరుపతిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ భువనేశ్వరి హత్య కేసులోని మిస్టరీ వీడిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో ఆమె భర్త శ్రీకాంత్‌రెడ్డి నిందితుడిగా నిర్థారణ కావడంతో పోలీసులు ఆ కిరాతకుడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. భువనేశ్వరి ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తుండగా, శ్రీకాంత్‌రెడ్డి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ నిత్యం భార్యతో గొడవపడేవాడు. దీంతో ఆమె తెలిసినవారి దగ్గర రూ.10 లక్షలు తెచ్చి భర్తకు ఇచ్చింది.

ఈ అప్పు తీర్చాలని ఇటీవల అడుగుతుండటంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో గత నెల 22న భువనేశ్వరిని ఆమె భర్త శ్రీకాంత్‌ కిరాతకంగా చంపి సాక్ష్యాలను తారుమారు చేసే క్రమంలో సూట్‌కేసులో భార్య మృతదేహాన్ని తీసుకెళ్లి రుయా ఆస్పత్రి వెనుక తగలబెట్టాడు. అలానే వారి బంధువులకు అనుమానం రాకుండా కరోనాతో భార్య చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే సీసీ ఫుటేజీ ద్వారా నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.