గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనూజ మృతిపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఆమె విజయవాడ గుణదల ప్రాంతంలో మృతి చెందడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. వివరాల కోసం ఫొటోలను పోలీస్ వెబ్సైట్లో పెట్టారు. చనిపోయిన యువతి సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనూజ అని గుంటూరు నగరంపాలెం పోలీసులు నిర్ధారించారు.
గుంటూరు నుంచి విజయవాడ ఎందుకు వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె సెల్‌ఫోన్ ఆధారంగా వడ్డేశ్వరం, నులకపేట ప్రాంతాల్లో తిరిగినట్లు గుర్తించారు. గురువారం ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీ రహదారిలో ఓ యువకుడు ఆమెను ద్విచక్రవాహనంపై దించినట్లు గుర్తించారు. ఈనెల 18వ తేదీన ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. కేఎల్‌యూ రోడ్డులో దింపినట్లు చెప్పడం, తనూజ కూడా వడ్డేశ్వరం బకింగ్‌హామ్ కెనాల్ బ్రిడ్జి మీద నుంచి వడ్డేశ్వరంలోకి రావడం గుర్తించారు.అనంతరం ఆ యువతి సెల్‌ఫోన్ టవర్ సిగ్నల్ నులకపేటలోని తహసీల్దార్ కార్యాలయం, మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ మెయిన్రోడ్లో తిరిగినట్లు గుర్తించారు.
మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ రోడ్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో తనూజ ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు. తనూజకు రోడ్డు ప్రమాదం జరిగితే ఎవరైనా ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయి ఉంటే మృతదేహాన్ని అక్కడ పడవేసి ఉంటారా అనే అనుమానాలతోపాటు అఘాయిత్యం చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు ఉందని విజయవాడ పోలీసులు చెబుతున్నారు. మృతురాలి తల్లిదండ్రులను విచారించినా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు ఎలాగైనా ఈ కేసును ఛేదించాలనే పట్టుదలతో 15 మంది సభ్యులతో ఐదు బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి.