పిల్లలకు విషమిచ్చి భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఎల్‌బీనగర్ పరిధిలోని హస్తినాపురంలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది. ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రదీప్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య స్వాతి, పిల్లలు కళ్యాణ్ కృష్ణ(5), జయకృష్ణ(1.5)లతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు
ముక్కుపచ్చలారని ఆ చిన్నారులు నాన్న ఇచ్చింది విషమని తెలియక దానిని తాగి విగతజీవులయ్యారు. విగతజీవులుగా పడి ఉన్న ఆ చిన్నారులను చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వరకొండ మండలం నెరడుకొమ్మ గ్రామానికి చెందిన వీరు హస్తినాపూర్లోని సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఈ ఆత్మహత్యలకు కారణమని తెలుస్తోంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.