చంద్రబాబు ఉంటే అభివృద్ధి జరగనివ్వం..దుర్బుద్ధి బయటపెట్టిన బీజేపీ !

గత కొద్దిరోజులుగా కేంద్ర – రాష్ట్ర అధికార పక్షాల మధ్య సరయిన వాతావరణం లేదు, విభజన హామీలు అమలు చేయడంలో మోడీ మోసం చేసారు అని చంద్రబాబు ఆరోపిస్తుంటే, చంద్రాబాబు అవినీతి పెరిగిపోతోంది అందుకే ఆయనకు సహకరించము అని బీజేపీ చెప్పుకొస్తోంది. అయితే ఇన్నాళ్ళు కేంద్రం నుండి ఎపీకి రావాల్సినవి తీసుకొస్తామని అవి ఇస్తానని మోడీ-షా లు మాటిచ్చారని చెప్పుకొచ్చిన బీజేపీ నేతలు ఇప్పుడు బాబు మీద పగ బట్టినవిషయాన్ని బట్ట బయలు చేశారు. తమకు ఏపీ అభివృద్ధి కంటే రాజకీయాలు, రాజకీయ వైరాలే ముఖ్యమని వారు కుండ బద్దలు కొట్టి చెప్పడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ బీజేపీ అద్యక్ష్యుడిగా ఎన్నికవ్వాల్సి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన సోము వీర్రాజు తమ మనసులో ఉన్న విషాన్ని బయట పెట్టారు.

చంద్రబాబు అవినీతి చేసారని చెప్పుకొస్తున్న ఆయన ప్రజల్లో బీజేపీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు టీడీపీ కంకణం కట్టుకుందని, చంద్రబాబు అడిగితే స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే జోన్‌ అసలుకే ఇవ్వబోమని క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారు. అవినీతిపరులకు ఏమాత్రం సహకరించబోమని ప్రధాని మోడీ ఎన్నడో చెప్పారని, స్టీల్‌ ప్లాంట్‌ కోసం దీక్ష చేస్తున్నవారు మూతపడిన వాటిని ఎందుకు తెరిపించలేదని ఆయన ప్రశ్నించారు. బిజెపి మీద దాడులు, ధర్మపోరాటాలు ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు బిజెపి భయపడదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి చేసిన అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చకు సిద్ధంగా ఉన్నామని సోము వీర్రాజు అన్నారు. సుజ‌నా చౌద‌రి ఎందుకు తెర‌వెన‌క్కి వెళ్లారో చంద్ర‌బాబు చెప్పాల‌ని నిల‌దీశారు. ఆయ‌న నాలుగేళ్లు ప‌ద‌వి అనుభ‌వించి, కేంద్రం ఎంతో చేసింద‌ని చెప్పుకొచ్చి., ఇప్పుడు సైలెంట్ కావ‌డానికి కార‌ణం ఏంట‌ని ప్ర‌శ్నించారు.