శంభో శంకర….తెలుగు బుల్లెట్ మూవీ రివ్యూ

నటీనటులు: షకలక శంకర్‌, అజయ్‌ ఘోష్‌, కారుణ్య తదితరులు
సంగీతం: సాయి కార్తిక్‌
సినిమాటోగ్రఫీ: రాజశేఖర్‌ ఎస్‌
నిర్మాత: సురేశ్‌ కొండేటి
కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం : శ్రీధర్‌ ఎన్‌

ఆఫీస్ బాయ్ నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ క‌మెడియ‌న్‌ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న షకలక శంకర్ ‘శంభో శంకర’తో హీరోగా మారాడు. ఈ సినిమా నేడే విడుదల అయింది. త్రివిక్రమ్, రవితేజ, దిల్ రాజు, అల్లు శిరీష్ తదితరుల దగ్గరకు కథ పట్టుకుని వెళ్లి రెండు కోట్లు పెట్టి నిర్మించమంటే రెండేళ్లు ఆగమన్నారని వెటకారంగా వ్యాఖ్యానించి వార్తలలోకి ఎక్కినా శంకర్, అంతలా పెద్ద హీరోల్ని డైరెక్టర్లని వెటకారం చేస్తున్నాడంటే సినిమా బ్రహ్మాండం అని ప్రేక్షకుల్లో ఫీలింగ్ కల్పించాడు. దీనికి తోడు రెండు కోట్లతో బడ్జెట్ తో తీసిన ఈ సినిమా బిజినెస్ దగ్గర దగ్గరగా ఆరు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరగడం సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. సో ఈ సినిమా శంకర్ కి హిట్ తెచ్చిపెట్టిందా లేక ఫట్ మని కొట్టిందా అనేది చూద్దాం.

శంభో శంకర కధ పరిశీలిస్తే :

ఆంకాళ్లమ్మపల్లె అనే ఊరికి ప్రెసిడెంట్‌ అజయ్‌ ఘోష్, చుట్టుపక్కల ఉన్న అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్‌ చేస్తుంటాడు. ఎప్పుడూ తన వ్యాపారం ధ్యాసే తప్ప ఆ ఊరి ప్రజల కష్టాలను పట్టించుకోడు. పైపెచ్చు ఎదురు తిరిగిన వూరి వారి మీద దౌర్జన్యం చేస్తుంటాడు. పోలీసులు కూడా ప్రెసిడెంటు మ‌నుషులే. అందుకే ఎలాగైనా పోలీసై ఆ ఊరిని క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించాల‌ని భావించే కుర్రాడు శంక‌ర్ (ష‌క‌ల‌క శంక‌ర్‌). ప్రెసిడెంటుకి ఎదురు తిరిగిన పాపానికి, చేతుల్లోకి వ‌చ్చిన పోలీసు ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అంతేకాక ప్రెసిడెంట్‌ కొడుకు వల్ల శంకర్‌ చెల్లెలు అన్యాయంగా చనిపోతుంది. అందుకే ఇక ఆలస్యం చేయకుండా ప్రెసిడెంటు మీద యుద్ధం ప్రకటించి ఊరిని కాపాడడానికి రంగంలోకి దిగుతాడు. అందుకోసం ఏం చేశాడు? ఆ ఊరిని, ప్రజల్ని ప్రెసిడెంట్‌ బారి నుంచి ఎలా రక్షించాడు? అనేదే శంబో శంకర కథ.

విశ్లేషణ : శంభో శంకర మూవీ

ఓ పెద్ద హీరో కోసం మాస్ క‌థ రాసుకుని `ఇలాంటి అవుట్ డేటెడ్ కధలు మేము చేయము` అంటూ వాళ్లు తిప్పి కొడితే దాన్ని ష‌క‌ల‌క శంక‌ర్‌తో శంకర్ మార్కెట్ కి తగ్గించి తీసేసి జనాల మీదకి వదిలేసినట్టు ఉంది. ఎందుకంటే ఒక కమెడియన్ హీరో అవుతున్నాడంటే సాధారణంగా సినిమా మొత్తం నవ్వులే ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు కానీ అదేంటో శకలక శంకర్ హీరో అయిన ఈ సినిమాలో కామెడీని చొప్పించాల్సి వచ్చింది. సినిమాలో కామెడీ తప్ప అన్నీ చూపించాలనుకున్నారు దర్శకుడు. పల్లెటూరు, ప్రెసిడెంట్‌ దౌర్జన్యాలు, రైతుల కష్టాలు, ఇవన్నీ పాతకాలం నాటి కథా వస్తువులు. అరిగిపోయిన సన్నివేశాలు, పాత డైలాగులు, పాత కాలం నాటి హీరోయిజం తప్ప ఈ సినిమాలో ఇంకేమీ కనిపించవు.

ఊరిని బాగు చేయ‌డం, స్కూళ్లు క‌ట్టించ‌డం, జెండా ఎగ‌రేయ‌డం, రైతుల గురించి స్పీచులు ఇవ్వ‌డం… ఇవ‌న్నీ చూస్తుంటే ష‌క‌ల‌క శంక‌ర్‌కి మాస్ హీరోగా ఎదిగిపోవాలన్న త‌ప‌న ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. ఇన్నాళ్లూ నవ్వించిన శంకర్‌ ఒక్కసారిగా సీరియస్‌ డైలాగులు చెబుతూ ఫైటింగ్‌లు చేస్తుంటే చూడ్డానికి మనసు ఒప్పుకోదు. కథంతా సీరియస్‌గా నడుస్తుంది. అజ‌య్ ఘౌష్‌లాంటి భారీ ప‌ర్స‌నాలిటీని ప‌ట్టుకుని వార్నింగులు ఇస్తుంటే.. ఏదోలా అనిపిస్తుంది. ద్వితీయార్థంలో ప్రెసిడెంట్‌పై శంకర్‌ ఎలా పగ తీర్చుకున్నాడు? ఆ ఊరిని ఎలా అభివృద్ధి చేశాడు? అనేదే చూపించాడు దర్శకుడు. అవి కూడా పాత సినిమా క్లైమాక్స్ లానే ఉంది.

శంభో ‘శంకర’ నటీనటుల విషయానికి వస్తే :

శంక‌ర్‌కి ఏదో చేయాల‌న్న త‌ప‌న ఉంది. శంకర్‌ హీరో అవ్వాడానికి కష్టపడ్డాడు ఒళ్లు వంచి ఫైట్లు చేశాడు. డ్యాన్సుల్లోనూ ఆకట్టుకున్నాడు. అయితే తనదైన వినోదాన్ని అందించడంలో విఫలమయ్యాడు. త‌న‌లోని కామెడీని చంపేసుకుంటూ సీరియెస్‌ యాంగిల్ చూపిస్తే చూడ్డానికి ప్రేక్ష‌కుడు ఇంకా సిద్ధంగా లేడ‌న్న విష‌యాన్ని డైరెక్టర్ అయినా గుర్తించాల్సింది.డాన్సులు, ఫైట్లు బ్ర‌హ్మాండంగా చేశాడు. కాక‌పోతే పాట‌ల‌కు డూప్‌ ని పెట్టి చేయించినట్టు అనిపించింది. ఇక కథానాయిక పాత్రకు అసలే ప్రాధాన్యం లేదు. అజయ్‌ ఘోష్‌ మొదట్లో కాస్త భయపెట్టినా ఆ తర్వాత అతని పాత్ర తేలిపోయింది.  సాయికార్తిక్ ట్యూన్లు బాబోయ్ అనిపించాయి. పెద్ద హీరో కి ఇచ్చిన‌ట్టు భారీ ఆర్‌.ఆర్ కొట్టేశాడు. శంక‌ర్‌కి స‌రిప‌డా క‌థ‌, సన్నివేశాలు రాసుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. నిర్మాణ విలువ‌లూ సోసోగానే ఉన్నాయి.

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : శంకరా…ఏమిటి మాకీ పరీక్షా !
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 1.5 / 5