ఎన్టీఆర్‌లో ఏయన్నార్‌ మారాడా?

Sumanth to play ANR In Ntr biopic movie

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రంకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ పాత్రను బాలకృష్ణ పోషించనుండగా క్రిష్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో పలువురు స్టార్స్‌ కనిపించబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏయన్నార్‌ పాత్రలో ఆయన మనవడు నాగచైతన్య కనిపిస్తాడని చర్చలు జరుగుతున్నాయి. మహానటి చిత్రంలో ఏయన్నార్‌గా నాగచైతన్య కనిపించి మెప్పించాడు. అందుకే ఎన్టీఆర్‌ చిత్రంలో కూడా ఏయన్నార్‌గా నాగచైతన్యను ఎన్టీఆర్‌ యూనిట్‌ సభ్యులు బుక్‌ చేసే యోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.

ఎన్టీఆర్‌ చిత్రంలో ఏయన్నార్‌ పాత్ర ఉంటుందంటే ఖచ్చితంగా బాలకృష్ణ, నాగచైతన్యలు కలిసి నటించాల్సి ఉంటుంది. అలా నటించడం బాగుండదని, అలా ఇద్దరి కాంబో సీన్స్‌ ఆకట్టుకోవనే ఉద్దేశ్యంతో దర్శకుడు క్రిష్‌ ఉన్నాడు. బాలకృష్ణకు కాస్త అటు ఇటుగా వయస్సు ఉండే వ్యక్తి అయితే పర్వాలేదని అక్కినేని వారి మరో మనవడు అయిన సుమంత్‌ను ఎంపిక చేసేందుకు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలు లేక, సక్సెస్‌లు లేక తన వంతు ప్రయత్నాలు అన్నట్లుగా చేస్తూ పోతున్న సుమంత్‌ అడిగితే వెంటనే ‘ఎన్టీఆర్‌’ చిత్రానికి ఓకే చెప్పే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌ చిత్రంలో కృష్ణ పాత్రలో మహేష్‌బాబు, చంద్రబాబు నాయుడు పాత్రలో రానాలు కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. పలువురు స్టార్స్‌తో పాటు ఎంతో మంది కొత్త వారు కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.