నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిని మద్యం మత్తులో ఓ యువకుడు కిరాతకంగా కొట్టి హత మార్చాడు. కూరతో కాకుండా రసంతో భోజనం పెట్టిందని గొడవకు దిగి గొడ్డలితో దాడి చేశారు. ఈ కిరాతక దుశ్చర్య జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీ మారుమూల గ్రామమైన అడ్డులులో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన రేగం రాజులమ్మ, రామన్న దొర దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. కుమార్తె, పెద్ద కుమారుడికి వివాహాలు జరిగాయి. చిన్న కుమారుడు మత్స్యలింగం, అర్జులమ్మ, రామన్న దొర కలిసి ఓ ఇంటిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యలింగం పూటుగా మద్యం తాగి ఆదివారం అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నాడు. భోజనం పెట్టమని తల్లి అర్జులమ్మ ను కోరాడు. రసంతో అన్నం పెట్టడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కూరతో భోజనం పెట్టలేదని కోపగించుకుని తల్లితో గొడవకు దిగి కొట్టాడు.
అడ్డుకున్న తండ్రి రామన్న దొరను బెదిరించడంతో ఆయన గ్రామంలోనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద కొడుకు లక్ష్మణరావు ఇంటికి పరుగుతీశాడు. ఇంతలో మత్స్యలింగం గొడ్డలి వెనుక భాగంతో అర్జులమ్మ తలపై తీవ్రంగా కొట్టాడు. గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. పెద్దకొడుకు వద్దకు పారిపోయిన రామన్న సోమవారం ఇంటికి వెళ్లి చూసేసరికి రాజులమ్మ మృతిచెంది ఉంది. మత్స్యలింగం పరారయ్యాడు. రామన్నదొర సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.