ఆస్తి తగాదాల్లో వృద్ధులైన తల్లిదండ్రులపై ఓ తనయుడు క్రికెట్ బ్యాట్‌తో దాడికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. కాట్రేనికోన మార్కెట్ ప్రాంతానికి చెందిన పాలంకి సత్యనారాయణ రెవెన్యూ శాఖలో గ్రామ నౌకరుగా పని చేసేవాడు. ఆ సమయంలో ఉన్నతాధికారులతో తనకున్న పరిచయాలతో గ్రామకంఠం, ప్రభుత్వ భూముల్లో పలుచోట్ల డి పట్టాలు, ఇళ్ల స్థలాలు సంపాదించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. సత్యనారాయణ వయస్సు మీద పడటంతో ఆ విధులను అతడి చిన్న కుమారుడు రాంబాబు అనధికారికంగా నిర్వహిస్తున్నాడు.
ఆస్తి విషయంతో కుటుంబ సభ్యుల మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. గురువారం త్రీవ స్థాయిలో వివాదం జరగడంతో రాంబాబు క్రికెట్ బ్యాట్‌తో తల్లిదండ్రులు నాగమణి, సత్యనారాయణ, అన్న పాలంకి శ్రీనులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో వారికి తల, ఇతర శరీర భాగాలపై బలమైన గాయాలయ్యాయి. వారిని తొలుత ముమ్మిడివరం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లిదండ్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. కాట్రేనికోన ఎస్సై షేక్ జబీర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.