తన భార్యను దూషించడాన్ని తట్టుకోలేని కుమారుడు కన్న తండ్రిని చంపిన ఘటన సోమవారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి సఫ్దార్‌నగర్‌లో ఎం.డి. ఇంతియాజ్ (55), ఆయన ఇద్దరు కుమారులు సలావుద్దీన్, బురానుద్దీన్ ఒకే ఇంట్లో వేర్వేరుగా నివాసముంటున్నారు. ఇంతియాజ్ గతంలో ఆర్‌ఎంపీగా పని చేసి మానేశాడు.
పదేళ్లుగా మానసిక పరిస్థితి బాగాలేదు. కనిపించినవారినల్లా దూషిస్తుండేవాడు. ఆదివారం సాయంత్రం మద్యం తాగి వచ్చి తన పెద్ద కుమారుడు సలావుద్దీన్ భార్యతో గొడవ పడ్డాడు. ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. ఆవేశానికి లోనైన సలావుద్దీన్ గదిలో నిద్రిస్తున్న తండి తలపై సెంట్రింగ్ కర్రతో మోదాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి చిన్న కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.