‘‘ఫ్లైయింగ్ సిఖ్’’గా ప్రసిద్ధి పొందిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘భాగ్ మిల్కా భాగ్’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన ఫరాన్ అక్తర్, సోనం కపూర్‌కు మంచి గుర్తింపు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించడమే అదృష్టంగా భావించిన నటీనటులు.. నామమాత్రపు పారితోషికం తీసుకున్నారు.
సోనం సైతం కేవలం 11 రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుందట. భాగ్ మిల్కా భాగ్ డైరెక్టర్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా తన బయోగ్రఫీలో ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు.త్వరలో విడుదల కానున్న ‘‘ది స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్’’లో సోనంపై ప్రశంసలు కురిపించిన రాకేశ్ ఓంప్రకాశ్.. ‘‘ఇది లవ్‌స్టోరీ కాదు అని సోనంకు ముందే తెలుసు. బాల్యంలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్న వ్యక్తి కథ ఇది. ఈ మూవీలో అతిథి పాత్రలో నటించేందుకు సోనం వెంటనే ఒప్పుకొంది.సినిమాలో తను భాగం కావాలని నిర్ణయించుకుంది.
అప్పటికే ఢిల్లీ-6 సినిమాలో మేం కలిసి పనిచేశాం. మా మధ్య అప్పటి నుంచి అనుబంధం ఉంది. భాగ్ మిల్కా భాగ్ గురించి చెప్పగానే తనకు 7 రోజుల సమయం కావాలని అడిగింది. కేవలం 11 రూపాయలు తీసుకుని బీరో పాత్ర పోషించింది. తన మనసు చాలా మంచిది’’ అని పేర్కొన్నాడు. కాగా 2013లో విడుదలైన భాగ్ మిల్కా భాగ్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో మిల్కాసింగ్ ఇష్టసఖి పాత్రలో సోనం నటించింది.