హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సోనియా గాంధీ బర్త్ డే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు పలువురు మ త్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ జన్మదినం తెలంగాణ ప్రజలకు ఒక పండుగ అని అన్నారు. డిసెం బర్ 9, 2009లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైంది.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఉక్కు సంకల్పంతో సోనియమ్మ మన ఆకాంక్షలు నెరవేర్చారు.. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో.. మనం చూడలేదు.. కానీ, తెలంగాణ తల్లి సోనియమ్మ రూపంలో ఉంటుందని ఆ తల్లి మనకు భరోసా ఇచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణ ప్రజలు కృతజ్ఞత భావంతో ఉంటారని మొన్నటి ఎన్నికల తీర్పుతో నిరూపించారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలు నాకు ఈ బాధ్యత ఇచ్చారు.. సేవకుడిగా ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత నాది.. కార్యకర్తలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం .. ఈ ప్రభుత్వం ప్రజలది.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు.