ప్రస్తుతం తెలంగాణలో పాదయాత్రల సీజన్ మొదలైందని, అలా ప్రజల వద్దకు వెళ్తే అక్కడ అభివృద్ధి చూడాలని రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కె.తారక రామారావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సోనియాను తెలంగాణ తల్లి అంటున్న రేవంత్ రెడ్డి గతంలో బలిదేవత అన్నాడు. రేపు చంద్రబాబును తెలంగాణ తండ్రి అని కూడా అంటాడేమోనని’ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్‌రెడ్డిలో ఇంకా టీడీపీ వాసన పోలేదని ధ్వజమెత్తారు. ఎవరిని దేంతో కొట్టాలో తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా బుధవారం మధ్యాహ్నం 1.31 గంటలకు పదవీ బాధ్యతలు తీసుకున్న అనంతరం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి సమష్టి నిర్ణయాలు, పోరాటాలతో ముందుకెళ్తుందని, 2023 ఎన్నికల్లో సమష్టిగా అధికారంలోకి వస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. వ్యక్తిగత నినాదాలు ఇవ్వడం మానుకోవాలని, ఇక నుంచి కాంగ్రెస్ ఏకైక నినాదం ‘జై సోనియా’నే అని స్పష్టం చేశారు.