సాయం చేయాలన్న తపన, మంచి మనసు ఉంటే చాలు.. ఎలాగైనా సాయం చేయవచ్చని నిరూపించాడు బాలీవుడ్ రియల్ హీరో సోనూ సూద్. చేసేది విలన్ పాత్రలైనప్పటికీ ప్రజల్లో రియల్ హీరోగా నిలిచాడు. లాక్డౌన్లో వేలాదిమంది వలస కూలీలకు ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటు చేసి ఇళ్లకు చేర్చి ఆపద్భాందవుడయ్యాడు. నిజానికి సాయం కావాలి అని అర్థించిన ప్రతి ఒక్కరికి సోనూ సూద్ సహాయం అందిస్తున్నాడు. దీంతో లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ తన దాన సేవలను ఇంకా కొనసాగిస్తున్నాడు. అందరి మన్ననలు పొందుతున్న సోనూ సూద్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో ఆయన 47వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా సోనూ సూద్‌కు అశేష అభిమానులు, సెలబ్రిటీల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా సోనూ సూద్ జూలై 30,1973లో పంజాబ్‌లో జన్మించారు. తండ్రి శక్తి సాగర్ సూద్ వ్యాపారవేత్త. తల్లి ఉపాద్యాయిని. సోనూ సోదరి మోనికా ప్రస్తుతం సైంటిస్టుగా పనిచేస్తున్నారు. సోనాలిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. 1999లో కలాగర్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మూడు సంవత్సరాలకు బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. తెలుగులో అరుంధతి సినిమాలో సోనూ సూద్ నటన ఆయనకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. తన పాత్రలతో మనందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నారు.