రీల్లో ఎవరైనా హీరో అవ్వొచ్చు.. రియల్‌గా హీరో కావాలంటే మాత్రం మంచి మనసు.. స్పందించే హృదయం ఉండాలి. ఈ రెండు నటుడు సోనూ సూద్‌కు ఉన్నాయి. కరోనా కష్టకాలంలో ఎందరికో సాయం చేస్తూ.. రియాల్ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్. ఇప్పటికే ఆయన దాతృత్వానికి ఎన్నో ప్రశంసలు, అవార్డులు లభించాయి. తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు సోనూ సూద్. ఆయనను పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా నియమిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
‘ప్రజల చేత రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్‌ని ప్రస్తుతం పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా నియమించాం’ అంటూ ట్వీట్ చేశారు. సోనూ సూద్ స్వస్థలం పంజాబ్‌లోని మోగా అన్న విషయం తెలిసిందే. కోవిడ్ సంక్షోభ సమయంలో సోనూ సూద్ ఎందరికో సాయం చేశారు. వలస కార్మికులు సొంత ఊరికి చేరుకోవడానికి సాయం చేశారు. వారికి ఆహారం, ఆశ్రయం కల్పించారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంతకుముందు పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా సోనూ సూద్ ఆటోబయోగ్రఫీ రాస్తున్నట్లు ప్రకటించింది. మహమ్మారి సమయంలో ఆయన చేసిన సేవలను ఇందులో పంచుకోనున్నారు. మీనా అయ్యర్ సహా రచయితగా వ్యవహరిస్తున్నారు. ‘‘ ‘ఐయామ్ నో మెసయ్య’ (నేను రక్షకుడిని/కాపాడేవాడిని కాదు అని అర్థం)’’ పేరుతో ఈ ఆటోబయోగ్రఫీ ఈ ఏడాది డిసెంబర్లో వెలువడనుంది. ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ.. ‘ప్రజలు నా మీద ప్రేమతో ‘మెసయ్య’ అని పిలుస్తున్నారు.
వాస్తవంగా చెప్పాలంటే నేను రక్షకుడిని కాదు. నా మనసు ఏం చెప్పిందో అదే నేను చేశాను. మనుషులుగా ఇది మన బాధ్యత. ఒకరి పట్ల ఒకరం కరుణతో ఉండాలి.. సాయం చేసుకోవాలి’ అన్నారు. ఇక మహమ్మారి సమయంలో తాను ఎందరినో కలిశానని.. వారి బాధలు విన్నానని తెలిపారు. ఇది తన జీవితంలో ఎంతో మార్పు తెచ్చిందని.. జీవితాన్ని చూసే విధానాన్ని మార్చిందని తెలిపారు. ఇది తన ఒక్కడి కథ మాత్రమే కాదు.. ఎందరో వలస కార్మికులది కూడా అన్నారు సోనూ సూద్.