కరోనా మహమ్మారి దేశాన్ని చుట్టుకున్నది మొదలు ప్రతీ దశలో సాయం చేసేందుకు ముందు వరసలో నిలుస్తూ రియల్ హీరోగా ప్రశంసంలందుకుంటున్న నటుడు సోనూసూద్‌కు సోషల్ మీడియాలో లభిస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. సామాన్యులనుంచి సెలబ్రిటీల దాకా ఆయన సేవలను కొనియాడుతున్నవారే.
ఇటీవల తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ కూడా రియల్ హీరో అంటేనే సోనూ సూదే అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ తెలుగు నటుడు బ్రహ్మాజీ మరో అడుగు ముందుకేశారు. సోనూ సూద్‌కు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇవ్వాలంటూ తను గట్టిగా కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు తన ప్రతిపాదనను సమర్ధించే వారంతా తన ట్వీటను రీట్వీట్ చేయమని బ్రహ్మాజీ కోరారు. దీంతో ట్విటర్లో రీట్వీట్ల సందడి నెలకింది.
మరోవైపు ఈ ట్వీట్‌కు సోనూసూద్ స్పందించిన తీరు విశేషంగా నిలిచింది. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా? 135 కోట్ల మంది భారతీయుల ప్రేమ, అభిమానమే పెద్ద అవార్డు. దానిని ఇప్పటికే పొందాను. మీ అభిమానానికి ధన్యవాదాలు“ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో దటీజ్ సోనూ సూద్ అంటూ ట్వీపుల్ కొనియాడుతున్నారు.
పద్మ అవార్డులకు పేర్లను సిఫార్స్ చేయమంటూ కేంద్రం కోరుతోందనే వార్తను పీటీఐ వెల్లడించింది. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మభూషన్, పద్మశ్రీ నామినేష్లన స్వీకరణకు సెప్టెంబర్ 15వ తేదీని చివరి తేదీగా తెలిపింది. దీంతో కరోనా మొదటి వేవ్‌నుంచి ఇప్పటికే తనదైన రీతిలో బాధితులను ఆదుకుంటున్న సోనూ సూద్‌కు పద్మ అవార్డు లభించాలంటూ కోరుకుంటున్నారు.
కాగా కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు ఇలా వివిధ రంగాల్లో విశిష్ట సేవ చేసినవారికి ఈ అత్యున్నత పద్మ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం మే 1, సెప్టెంబరు 15 తేదీలలో పద్మ పురస్కారానికి సంబంధించిన సిఫారసులను భారత ప్రధాని ఏర్పాటు చేసిన పద్మ అవార్డుల కమిటీకి సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 26న రాష్ట్రపతి చేతులమీదుగాఎంపిక చేసిన వారికి ఈ పురస్కారాలను అందజేస్తారు.