కరోనా కష్టకాలంలో నేనున్నానంటూ వేలాది మందికి తన వంతు సాయమందిస్తూ రియల్‌హీరో అయిపోయాడు సోనూసూద్. లాక్ డౌన్ కాలంలో ఎంతోమంది కార్మికులను తన సొంత ఖర్చులతో వారి సొంతిళ్లకు పంపి అందరి హృదయాలను గెలుచుకున్నాడు.
ఇపుడు సెకండ్ వేవ్‌తో ఇబ్బంది పడుతున్న వారిని సైతం ఆదుకుంటున్నాడు. ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ కలియుగ కర్ణుడిగా మారిపోయాడు. అయితే తాజాగా కోవిడ్ బారిన పడిన కొంతమంది కళ్లముందే ప్రాణాలు వదులుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోతున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
ఇటీవల ఓ కోవిడ్ బాధితుడు ప్రాణాలు వదలడంతో ట్విటర్ వేదికగా సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మనం కాపాడాలని ప్రయత్నిస్తున్న వ్యక్తిని కోల్పోవడం సొంత వాళ్లను కోల్పోవడం కంటే తక్కువేం కాదు. తనను రక్షిస్తామని మాట ఇచ్చిన కుటుంబాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ రోజు నేను కొంతమందిని కోల్పోయాను.
వాళ్ల కోసం నాకు రోజుకు కనీసం 10 సార్లు ఫోన్ చేసేవారు ఇక ఎప్పటికీ కాల్ చేయరు. నేను నిస్సహాయుడిగా మారిపోయాను’ అంటూ ట్వీట్ చేశాడు.ఇదిలా ఉండగా ఇటీవల సోనూసూద్ ఏపీలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో, మరొకటి నెల్లూరులోని ఆత్మకూరు ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాడు.