టాలీవుడ్ సినిమాల్లో విలన్ పాత్రలతో పరిచయమైన సోనూసూద్ లాక్‌డౌన్ మొదలు నుంచి ప్రజలకు సహాయం చేస్తూ నిజ జీవితంలో హిరోగా మారాడు. సోనూ ముంబైలో ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడ ఎటువంటి సహాయం కావాలన్న తక్షణమే ఆపన్న హస్తం అందించడంలో సోనూ ముందుంటున్నాడు. ఒక్కోసారి ప్రభుత్వాలకు కూడా సాధ్యం కాని కొన్ని పనులను ఆయన క్షణాల్లో చేసి చూపెడుతున్నారు. సేవ చేయాలంటే కావాల్సింది చేయాలనే శ్రద్ధ అని నిరూపిస్తున్న సోనూసూద్ తాజాగా ఒక మహిళను ట్విటర్‌లో ప్రశంసించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంధురాలైన నాగలక్ష్మి అనే మహిళ ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఆమెకు ప్రభుత్వం నుంచి మూడు వేల రూపాయల దివ్యాంగుల పెన్షన్ లభిస్తోంది. ఇటీవల ఆమె తన ఐదు నెలల పెన్షన్ 15 వేల రూపాయలను సోనూసూద్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చింది. ఈ విషయం తెలియడంతో సోనూసూద్ ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌లో.. ఆంధ్రప్రదేశ్ లోని వరికుంటపాడు అనే ఒక చిన్న గ్రామానికి చెందిన బొడ్డు నాగలక్ష్మి సోనూసూద్ ఫౌండేషన్‌కు 15 వేల రూపాయలు విరాళంగా ఇచ్చింది. ఆ డబ్బు ఆమెకు ఐదు నెలల పెన్షన్ అని సోనూసూద్ పేర్కొన్నారు. నా వరకు ఆమె భారతదేశంలోని అత్యంత ధనవంతురాలు. ఒకరి బాధను చూడటానికి మనకి కంటి చూపు అవసరం లేదని ఆమె సందేశం ఇచ్చింది. ఆమె నిజమైన హీరో అని సోనూ పేర్కొన్నాడు.