రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూఎన్డీపీ (యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డును సోనూకు ప్రదానం చేసింది. ఇప్పటివరకు అద్భుత నటనకు అవార్డులు ప్రశంసలు గెలుచుకున్న సోనూ తన గొప్ప మనసుకు, మానవత్వానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రశంసలతోపాటు తాజాగా యూఎన్డీపీ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్లో చాలాకొద్దిమందికి దక్కిన అరుదౌన గౌరవాన్ని సోనూ అందుకోవడం విశేషం.
నిస్వార్ధంగా, అలుపెరగకుండా లక్షలాది వలస కార్మికులను వారిని స్వస్థలాలకు చేర్చడం, ఆర్థికంగా ఆదుకున్న సోనూ సూద్ అక్కడితో ఆగిపోలేదు. విదేశాలలో చిక్కుకున్న వేలాదిమంది విద్యార్థులకు సహాయం, చిన్న పిల్లలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలు, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అవసరమైన వారికి ఉచిత ఉపాధి అవకాశాలను కల్పించడం లాంటి అనేక సేవలకుగాను ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.
సోమవారం సాయంత్రం జరిగిన వర్చువల్ వేడుకలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఏంజెలీనా జోలీ, డేవిడ్ బెక్హాం, లియోనార్డో డికాప్రియో, ఎమ్మా వాట్సన్, లియామ్ నీసన్, కేట్ బ్లాంచెట్, ఆంటోనియో బాండెరాస్ నికోల్ కిడ్మాన్ ప్రియాంక చోప్రా లాంటి వారికి ఐక్యరాజ్యసమితి సత్కరించింది. మరోవైపు ఇది అరుదైన గౌరవమనీ, యూఎన్ఓ గుర్తింపు తనకు చాలా ప్రత్యేకమైందంటూ సోనూ సూద్ సంతోషం వ్యక్తం చేశారు. తన దేశీయుల కోసం తనకున్న దాంట్లో తాను చేసిన చిన్న సాయమని పేర్కొన్నారు. 2030 నాటికి పేదరికం, ఆకలి, లింగ వివక్ష నిర్మూలన లాంటి 17 సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సాధనలో యుఎన్‌డీపీకి తన పూర్తిగా మద్దతు ఉంటుందన్నారు.