బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. కోవిడ్-19 నిర్దారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ఆయన హాస్పిటల్‌లో చేరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు సమాచారం అందించినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. కాగా గంగూలీ రెండో డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన కరోనా బారిన పడటం గమనార్హం.ఇక విధి నిర్వహణలో భాగంగా తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడం, ఈ క్రమంలో కోవిడ్ లక్షణాలు బయటపడటంతో సోమవారం రాత్రి ఆయనకు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించినట్లు సమాచారం.
ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘గత రాత్రి వుడ్‌లాండ్స్ నర్సింగ్‌హోంలో ఆయనను చేర్పించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది’’ అని పేర్కొన్నాయి. కాగా ఈ ఏడాది ఇప్పటికే గంగూలీ రెండుసార్లు అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఆంజియోప్లాస్టి నిర్వహించిన తర్వాత అనారోగ్య కారణాల రీత్యా కొన్నిరోజుల పాటు గంగూలీ ఆస్పత్రిలో ఉన్నారు.