టెక్‌ దిగ్గజాలకు భారీ షాకిచ్చిన సౌత్‌ కొరియా

టెక్‌ దిగ్గజాలకు భారీ షాకిచ్చిన సౌత్‌ కొరియా

టెక్‌ దిగ్గజాలు యాపిల్‌, గూగుల్‌కు భారీ షాకిచ్చింది సౌత్‌ కొరియా. స్మార్ట్‌ ఫోన్లలో ఈ రెండు కంపెనీల ‘యాప్‌’ మార్కెటింగ్‌ ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఇకపై యూజర్‌ తమకు నచ్చిన యాప్‌ స్టోర్‌ను ఎంచుకునే అవకాశం కల్పించనుంది. తద్వారా ఆ బడా కంపెనీలకు కమిషన్ల రూపంలో వెళ్లే బిలియన్ల ఆదాయానికి గండి పడినట్లయ్యింది.యాప్‌ మార్కెట్‌ప్లేసులలో టాప్‌ టూ పొజిషన్‌లలో కొనసాగుతున్నాయి యాపిల్‌, గూగుల్‌ కంపెనీలు.

అయితే మొబైల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో యాప్‌ కొనుగోళ్ల కోసం సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌ కమిషన్స్‌ పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఇది సుమారు 30 శాతం ఉండడం ఫోన్‌ మేకర్లకు ఇబ్బందిగా మారడంతో పాటు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపెడుతోందని దక్షిణ కొరియా భావించింది. అయినప్పటికీ పోటీ ప్రపంచం, డిమాండ్‌ కారణంగా ఇంతకాలం సైలెంట్‌గా ఉంటూ వస్తున్నాయి. ఈ తరుణంలో ధైర్యం చేసి సంచలన నిర్ణయం తీసుకుని.. ఆ రెండింటి ఆధిపత్యానికి చెక్‌ పెట్టేలా ప్రత్యేక చట్టం చేసింది దక్షిణ కొరియా.

ప్రపంచంలో ఈ తరహా చట్టం చేసిన దేశం దక్షిణ కొరియానే కావడం విశేషం. టెలికమ్యూనికేషన్స్‌ బిజినెస్‌ యాక్ట్‌ ప్రకారం.. ఇకపై యూజర్లకు ఫ్రీ ఛాయిస్‌ దక్కనుంది. అంటే కావాల్సిన స్టోర్‌ను, యాప్‌ మేనేజ్‌మెంట్‌ను ఫోన్‌ వినియోగదారుడే ఎంచుకోవచ్చు. తద్వారా ఈ రెండు కంపెనీలకే కాకుండా.. ఎపిక్‌ గేమ్స్‌(అమెరికా)లాంటి మరికొన్ని కంపెనీలకు ఛాన్స్‌ దక్కనుంది.పోయిన బుధవారమే ఈ బిల్లుపై ఓటింగ్‌ జరగాల్సి ఉండగా.. ఆలస్యంగా నిన్న ఈ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది.

దీంతో ఇంతకాలం యాప్‌ మేనేజ్‌మెంట్‌ బిజినెస్‌తో మధ్యవర్తిగా బిలియన్ల డాలర్లు దండుకుంటున్న యాపిల్‌ కంపెనీ, ఆల్ఫాబెట్‌ కంపెనీ(గూగుల్‌ మాతృక సంస్థ) పెద్ద షాకే తగిలినట్లయ్యింది. ఇక నేరుగా యూజర్లే తమకు కావాల్సిన యాప్‌లను పొందే వెసులుబాటు కల్పించిన ఈ చట్టంపై గూగుల్‌, యాపిల్‌లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.ఈ హడావిడి నిర్ణయం యాప్‌ డెవలపర్స్‌పైనా, కొరియన్‌ కన్జూమర్స్‌పైనా ప్రభావం చూపించనుందని గూగుల్‌ పబ్లిక్‌ పాలసీ సీనియర్‌ డైరెక్టర్‌ విల్సన్‌ వైట్‌ చెప్తున్నాడు.

‘ఇది ఫోన్‌ యూజర్‌ ప్రైవసీకి సంబంధించిన వ్యవహారం. ఇంతకాలం అది భద్రతతో కూడిన ఓ వ్యవస్థతో నడుస్తూ వస్తోంది. మేం వసూలు చేసే ఛార్జీలు సహేతుకం కాదనే వాదన అర్థవంతం కాదు. స్వేచ్ఛ ప్రకారం యూజర్‌ తనకు నచ్చిన యాప్‌ మేనేజ్‌మెంట్‌, యాప్‌ స్టోర్‌ను ఎంచుకుంటే.. అందులో అన్నీ యూజర్‌ ప్రైవసీని కాపాడతాయనే గ్యారెంటీ ఇవ్వగలదా ఈ కొరియా చట్టం? మేం ఇవ్వగలం’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశాడాయన.