Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దక్షిణ కొరియాలో యువత ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆత్మహత్య ఘటనలు వెలుగుచూస్తున్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. సాధారణ ప్రజల ఆత్మహత్యలే ఆ దేశాన్ని తీవ్రంగా కలిచివేస్తున్న తరుణంలో ప్రముఖ పాప్ స్టార్ కిమ్ జోంగ్ హ్యున్ కూడా ఇలానే బలవన్మరణానికి పాల్పడి తీరని విషాదం మిగిల్చాడు. 27 ఏళ్ల కిమ్ దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని ఓ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్ రూంలో కిమ్ బొగ్గులాంటి పదార్థాన్ని కాల్చి ఆ పొగ పీల్చడంతో చనిపోయాడని పోలీసులు వెల్లడించారు.
ఆత్మహత్యకు ముందు కిమ్ తన సోదరికి ఇదే నా ఆఖరి ఫేర్ వెల్, పరిస్థితులు చాలా కఠినంగా మారాయి. నన్ను వెళ్లనివ్వు అని మెసేజ్ లు పంపించాడు. అవి చూసిన ఆయన సోదరి వెంటనే పోలీసులకు సమాచారమందించింది. పోలీసులు కిమ్ ఉన్న హోటల్ ను గుర్తించి అక్కడకు వెళ్లేసరికి ఆయన అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలోనే కన్నుమూశాడు.
దక్షిణకొరియాలో ఈ రకంగా ఆత్మహత్యలు చేసుకోవడం సర్వ సాధారణంగా మారింది. కిమ్ చిన్న వయసులోనే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. దక్షిణ కొరియాలోని టాప్ రాక్ బ్యాండ్స్ లో ఒకటైన షినీ టీమ్ లో కిమ్ ప్రధాన గాయకుడు. తన అద్భుతమైన డ్యాన్స్, పాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. రెండేళ్ల క్రితం 2015లో కిమ్ విడుదల చేసిన ఆల్బమ్ బిల్ బోర్డ్ వరల్డ్ ఆల్బమ్స్ చార్ట్ లో అగ్రస్థానం దక్కించుకుంది. ఇటీవలి కాలం వరకూ కూడా కిమ్ ఎంతో హుషారుగా కనిపించాడు. గత వారం కూడా సియోల్ లో కచేరీలు నిర్వహించాడు. కిమ్ మృతితో ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.