గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) కన్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఆయన శుక్రవారం మధ్యాహ్నం వెంటిలేటర్‌పైనే తుది శ్వాస విడిచారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వస్తాడనుకున్న అభిమానులను శోకసంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు బాలు వెళ్లిపోయారు. బాలు 1.04 నిమిషాలకు మరణించినట్లు ఆయన కుమారుడు చరణ్ మీడియా ముందు స్వయంగా ధృవీకరించారు.
చెన్నైలోని మౌంట్‌రోడ్డులోని సత్యం థియేటర్ వద్దకు బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయం తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సందర్శకుల కోసం చెన్నై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. 50 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న ఆయన మృతి చెందడం పట్ల దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలు ఆయనకు అశ్రు నివాళులు అర్పిస్తున్నారు.