మొదలైన లోక్ సభ…పూర్తి గందరగోళ పరిస్థితులు !

speaker sumitra mahajan accept no confidence motion

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. లోక్‌సభ మొదలైన వెంటనే విపక్షాలు ఆందోళనకు దిగాయి. కొత్తగా ఎంపికైన ఎంపీల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టిముట్టి నిరసన వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాల్సిందిగా టీడీపీ ఎంపీలు పట్టుబట్టారు. సభలో నినాదాలు చేశారు. విభజన హామీలను నెరవేర్చాలంటూ టీడీపీ ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. విపక్షాల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వశ్చన్ అవర్ తర్వాతే విపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చకు అనుమతిస్తామని స్పీకర్ తేల్చిచెప్పారు.

సభ్యుల నిరసన మధ్య స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. తమతమ సమస్యల గురించి ఇతర విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ సమావేశాల్లో మొత్తం 46 బిల్లులు చర్చకు రానున్నాయి. ఇందులో మహిళా రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ బిల్లులు కూడా ఉన్నాయి. అయితే పార్లమెంట్ ప్రారంభం అవడానికి ముందే ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్ ప్రాంగణంలో టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీలు నినాదాలు చేశారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.